ఘనంగా రామానుజ సహస్రాబ్ది వేడుకలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరిగిన శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యం భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని చెప్పారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రస్తుతం స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, పోరాట యోధులను గుర్తు చేసుకుంటూ 75ఏళ్ల స్వాతంత్య్రాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం.. ‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు అన్నమాచార్యులు, కనకదాసు మొదలుకుని తులసీదాస్, కబీర్‌దాస్ వంటి సాధు సంతుల ఉపదేశాలు, సందేశాల ద్వారా దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగు కంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురు మంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను.
హైదరాబాద్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది. నేడు ఆవిష్కరించిన రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది అని ప్రధాని చెప్పారు.
రామానుజుల స్ఫూర్తిని చాటుతున్న మోదీ: చినజీయర్ స్వామి
మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి సంవత్సరాలకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచా రని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంకోసం నిరంతరం ఆయన పాటుపడుతూ వారి శ్రేయస్సునే మోదీ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు. వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలు తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషి చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏయే పనులు చేయాలో మోదీకి తెలుసు. సమయానుకూలంగా వాటిని చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతు న్నారు. రాజధర్మాన్ని అత్యంత స్పష్టంగా అమలు చేస్తున్నారు. సబ్‌కాసాత్` సబ్‌కా వికాస్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు.
రామానుజుల స్ఫూర్తిని అందరికీ చేరవేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రామానుజుల స్ఫూర్తిని పొంద డం, పంచడం కోసమే. ఈ స్ఫూర్తిని సమాజానికి చేరువ చేయడమే రామానుజులకు అందించే నిజమైన నివాళి అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న వివక్ష, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వెయ్యేళ్ల క్రితమే విప్లవానికి నాంది పలి కిన గొప్ప గురువు రామానుజాచార్యులు. ఆయన స్ఫూర్తిని చాటేందుకు సమతామూర్తి కేంద్రం దోహదం చేస్తుందన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సేవ చేయ డమే అత్యున్నత ఆధ్యాత్మిక కార్యక్రమమని, కుల మతాలకు అతీతంగా మానవత్వమే ప్రధానంగా సేవ చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు.
కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, ప్లహాద్ జోషి, కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని మాట్లాడుతూ సమతామూర్తి విగ్రహం ఏర్పాటుతో యుగయుగాలపాటు రామానుజాచార్యుల సిద్ధాంతం ప్రజలకు తెలుస్తూనే ఉంటుందని, 216 అడుగుల భారీ విగ్రహం విష్టాద్వైత సిద్ధాంతకర్త మరో అవతారంగానే భావిస్తున్నానని చెప్పారు. రామానుజాచా ర్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చినజీయర్ స్వామి ముచ్చింతల్‌లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఈ సమతా స్ఫూర్తి కేంద్రం అంతర్జాతీయ స్థాయి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు.
రామానుజులు ఏది బోధించారో, దాన్ని ఆచరించారని అందుకే గొప్ప గురువు అయ్యారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
బండారు దత్తాత్రేయ
శ్రీరామనగరం ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక స్ఫూర్తి కేంద్రంగా, తెలంగాణకు శోభాయ మానంగా నిలబడుతుందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
హిందువుల హితమే దేశ హితం: ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్
హిందువుల హితమే దేశ హితమని, మిగతా అనవసర కొట్లాటలు, కుమ్ములాటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్‌సంఫ్‌ుచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వెయ్యేళ్లకు పైగా విదేశీయుల పాతశవిక అత్యాచారాలు, భరించినా ఆనాడే సమానత్వాన్ని సాధించాం. మన పరంపర నేర్పినదాని ఆధారంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. భాష, ప్రాంతం తేడాలెన్ని ఉన్నా మనమంతా ఒక్కటే. ఎవరికి వారు తమ మేలు చూసుకుంటూనే ఇతరుల మేలు కూడా చూడాలని కోరారు. దేశంలో మధ్యభాగంగా ఉన్న భాగ్యనగరంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సరైన సమయంలో జరిగింద న్నారు. ఇది దేశభాగ్యమని, భాగ్యనగరంపేరు సార్థకమైందన్నారు.
హిందుత్వమే జాతిహితం: శివరాజ్
హిందుత్వమే దేశ హితమని, సనాతనధర్మం, పరంపరతో ముందుకు సాగాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. వివిధ భావాల కలబోత రామానుజాచార్యులు అని అన్నారు. సామాన్యులు, ధనికులు, బీసీలు, ఓబీసీలు, దళి తులు, మహాదళితులు అనే భేదభావాలన్నీ సమాప్తం కావాలన్నారు. శ్రీరామనగర ప్రాంగణాన్ని దేశ యువత సందర్శించి దేశ భావధారకు అనుగుణంగా వారి ఆలోచనాధోరణి మారితే అంతకంటే అద్భుతం మరొకటి ఉండదన్నారు.
రామానుజ విగ్రహాన్ని సందర్శించిన ఎపి సిఎం వై.ఎస్. జగన్
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో ఏర్పాటు చేసిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహం అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కూడా పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొ న్నారు. రామానుజుల విరాట్‌మూర్తిని, దివ్యదేశాలను సందర్శించుకున్నారు. దివ్యక్షేత్రం అద్భుతంగా రూపు దిద్దుకుందని, పట్టుదలతో గొప్ప క్షేత్రాన్ని రూపొందిం చారని చినజీయర్ స్వామిని కొనియాడారు.
ముచ్చింతల్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్
భక్తి ఉద్యమంలో శ్రీ భగవత్ రామానుజాచార్యుల తీరే వేరుగా చెప్పాలని, ఆయన ఆధ్యాత్మిక విషయాల్లో గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు.
ఈ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొని రామానుజుల బోధనలు అందరికీ అనుసరణీయమని చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పండిట్ రవిశంకర్, యోగాగురు రామ్ దేవ్‌బాబా, మైసూరు దత్తపీఠం అవధూత గణపతి సచ్చిదానందస్వామి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
జూపల్లి రామేశ్వరరావు కృషిని ప్రశంసించిన ప్రముఖులు
ముచ్చింతల్‌లో రామానుజసమతామూర్తి భారీ విగ్రహం ఏర్పాటులో శ్రీ చినజీయర్ స్వామి వెంటే ఉండి అన్నీ పనుల్లో సహాయపడిన మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావును పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులకు అవసరమైన ఏర్పాట్లను కూడా రామేశ్వరరావు చేయడంతోపాటు వారి పర్యటన భవ్యంగా సాగేలా చూశారు.
రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ముచ్చింతల్‌లో జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని శ్రీరామనగరంలోని ఆలయాలు, రామానుజ భారీ విగ్రహాన్ని సందర్శించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువుదీరిన రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. భగవద్రామానుజుల 120 సంవత్సరాల పరిపూర్ణ జీవనానికి ప్రతీకగా 120 కిలోల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు. సమతామూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ట జరిగిందని అన్నారు. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని, ఇక్కడి శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. రామానుజాచార్యులు సామాజిక అసమానతలను రూపుమాపారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెల్లడిరచారు. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని తెలిపారు. అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చిన్నజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు.