కొత్తగూడెంలో 'తానా 5కె' సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన తానా 5కె వాక్ విజయవంతమైంది. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ జే తాళ్ళూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, లావు అంజయ్య చౌదరి, చలపతి కొండ్రకుంట, రవి పొట్లూరి, జానయ్యకోట తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 5కె రన్‌లో విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ, తానా చైతన్యస్రవంతి వేడుకల్లో ఇంతమంది పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రైతుల రక్షణకు, కళల పరిరక్షణకు తానా ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే రైతులకు రక్షణ పరికరాలను, విద్యార్థినీ విద్యార్థులు సాంకేతికంగా ఎదగాలన్న ఆలోచనతో డిజిటల్ తరగతులకోసం అవసరమైన పరికరాలను కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తానా వివిధ చోట్ల నిర్వహించే చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.