సత్తెనపల్లిలో 'తానా' కార్యక్రమం విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. తానా సమకూర్చిన రూ.12 లక్షల విలువైన రైతు రక్షణ పరికరాలను 400 మంది రైతులకు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ పుట్టిన ఊరిని మరచిపోకుండా తానా సభ్యులు సేవలందించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. పురుగు మందుల పిచికారీలో రక్షణ కోసం మాస్క్, యాప్రాన్, గ్లౌజులు, కళ్లద్దాలు, టార్చ్‌లైట్, గొడుగు వంటివి అన్నదాతలకు అందజేయడం సంతోషకరమని చెప్పారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిచ్చి నదుల అనుసంధానాన్ని ఒక యజ్ఞంగా చేపట్టిందన్నారు. చంద్రబాబు దక్షతతో సంక్షోభం నుంచి వ్యవసాయ రంగం సుభిక్షం దిశగా సాగుతోందని అన్నారు. కార్యక్రమానికి ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని కోడెల ప్రారంభించారు.
తానా బోర్డు చైర్మన్ చలపతి కొండ్రకుంట మాట్లాడుతూ జన్మభూమి స్ఫూర్తితో ఇప్పటికి 25 వేల రైతు రక్షణ పరికరాలను పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడి రైతులను అమెరికా తీసుకువెళ్లి అక్కడి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో జరుగుతున్న వ్యవసాయ విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక సేవా ప్రణాళికలను వివరించారు.
తానా బోర్డు కార్యదర్శి లావు అంజయ్యచౌదరి, ప్రాంతీయ సమన్వయకర్త (కెనడా) సూరపనేని లక్ష్మీనారాయణ, రైతు కోసం కమిటీ చైర్మన్ కోట జానయ్య, సభ్యుడు మాగులూరి భానుప్రకాష్, ఓరుగంటి శ్రీనివాస్, బీఏఎస్‌ఎఫ్ హెడ్ కాండ్రు సుధాకర్, ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డు సభ్యుడు మేకల లక్ష్మీనారాయణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.