ఘనంగా జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవ ముగింపు వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 50 దేశాలలోని 100కుపైగా తెలుగు సంఘాలు, సాంస్కృతిక సంస్థలతో కలిసి జూలై 24 నుండి వారం రోజుల పాటు దృశ్య సమావేశాల ద్వారా నిర్వహించిన సాంస్కృతిక పోటీల ముగింపు వేడుకలు ఆగస్టు 2వ తేదీన అంతర్జాలంలో ఘనంగా జరిగాయి. తెలుగు భాషా సంస్కృతి వైభవం ఉట్టిపడే విధంగా ‘సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగ మంజరి, నాదామృతం, అందెల రవళి, కళా కృతి, రంగస్థలం, భువనవిజయం వంటి ఎనిమిది విభాగాలలో 32 అంశాలలో ప్రపంచ వ్యాప్తంగా 18,300 మంది తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని సంగీతం, సాహిత్యం, చిత్రకళ, సౌందర్య ప్రదర్శన, అభినయం, నాట్యం, గానంతో తమ ప్రతిభాపాటవాలను చాటారు. 475 మంది న్యాయనిర్ణేతలతో, 450 మంది వాలంటీర్లతో 382 జూమ్ సెషన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు భారీ స్థాయిలో నిర్వహించడం అందరినీ మెప్పించింది.
ఈ ముగింపు వేడుకల్లో తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ఇది ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం ముగింపు సమావేశమైన ఈ కార్యక్రమానికి ముగింపు లేదు. ఇది ముగింపు కాదు. మరో సాంస్కృతిక ఉద్యమానికి ఆరంభం ఇది. మహా భాషా ఉత్సవాలకు ప్రారంభం ఇది అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులపాటు 18 వేల మందితో నిర్వహించిన ఈ ఉత్సవం నింపిన స్ఫూర్తి... విశ్వ తెలుగు వికాసానికి, ప్రకాశానికి మరో ఆరంభంగా భావిస్తున్నామన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కలిసి ఆలపించబోతున్న తెలుగు సమైక్య బృందగానాలకు ఈ ఉత్సవం నాంది పలికిందన్నారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు ఉంటూ.. తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసే మహా వేదిక నిర్మాణానికి ఆరంభం ఈ ఉత్సవం. వేలాది లక్షలాది మంది తెలుగు వారిని ఒకే వేదిక మీదకు తీసుకొని వచ్చి తెలుగు వారి గుండె చప్పుడును ప్రపంచం మొత్తం ప్రతిధ్వనింపజేసిన ఈ మహోత్సవం ముగియలేదన్నారు.
ఈ మహోత్సవాలను తిలకించినప్పుడు అందరిలో ఉన్న భాషా ప్రేమను చూసినప్పుడు మనస్సు ఉప్పొంగిపోయింది. బాలబాలికల నుంచి వృద్ధుల దాకా వయోభేదాలు మరచి, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత విభేదాలు లేకుండా తెలుగు వారు అందరూ కలిసికట్టుగా.. ఒకే జట్టుగా.. జరుపుకున్న తెలుగు జాతి పండుగలా ఇది మారింది. పోటీల్లో మన తెలుగు వారు ప్రదర్శించిన ప్రతిభ పాటవాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆనందం కలిగింది. అసాధారణమైన మన వారి కళలు, నైపుణ్యాలు చూసి ఆశ్చర్యపోనివారుండరు. భువనవిజయం నిర్వహించిన చర్చాగోష్టి లో పాల్గొన్న పెద్దలు తెలుగు ను ఎలా అభివృద్ది చేయాలి అనే విషయంపై అమూల్యమైన సూచనలు చేసారు. వీటన్నిటినీ ప్రభుత్వాలకు పంపిస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 85 యేళ్ల పెద్దాయన 8 గంటలు తనవంతు వచ్చే వరకు ఓపికగా ఉండి పాల్గొని భాషాభిమానం చాటారు. ఒక అంధుడు మనసుకు హత్తుకునేలా వాద్య పరికరంపై పాటలు పాడి ఆశ్చర్యపరిచారు. బ్యూటీ పోటీల్లో పాల్గొన్నవారిలో విజేతలుగా నిలిచినవారి వివరాలను చూస్తే ఒకరు అమలాపురం, మరొకరు న్యూజీలాండ్, ఇంకొకరు న్యూయార్క్...ఇన్ని చోట్లనుంచి ఇంత మంది కలపగలిగామా అని ఆశ్చర్యం వేసింది ఆనందం కలిగింది. భవిష్యత్తులో కూడా మీ అందరితో కలిసి పనిచేయడానికి తానా సిద్ధంగా ఉందని జయ్ తాళ్ళూరి పేర్కొన్నారు.
తెలుగు భాషని సంస్కృతిని విజేతగా నిలపడానికి ఈ మహోత్సవం విజయవంతానికి అహోరాత్రులు నెలలు తరబడి శ్రమించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శిరీష తూనుగంట్ల, విజయ భాస్కర్, అలాగే ఇతర దేశాల సంస్థల ప్రతినిధులు.. ఒకరా ఇద్దరా... ఎందరో మరెందరో ఈ మహా యజ్ఞం లో పాలుపంచుకున్నారు వారందరికీ.. టీవీ 9 వారికి, బైట్ గ్రాఫ్ వారికి.. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జయ్ తాళ్ళూరి తన ప్రసంగంలో చెప్పారు.
సాంస్కృతిక మహోత్సవం కన్వీనర్ శిరీష తూనుగుంట్ల సమన్వయకర్తగా వ్యవహరించగా, తానా కార్యదర్శి రవి పొట్లూరి గారు స్వాగత వచనాలు పలుకగా, బోర్డ్ ఛైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంజయ్య చౌదరి లావు, కల్చరల్ కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని అతిధులను పరిచయం చేశారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, ప్రపంచ దేశాలు ఈ సంస్కృతిని ప్రశంసించాయని, మానసిక శారీరక ఆరోగ్యాలను కాపాడుకునే రక్షణ వ్యవస్థ మన సంస్కృతిలో దాగి ఉందని, ఎటువంటి సందర్భాల్లోనైనా ఎటువంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కొనేతత్వం భారతీయసాంప్రదాయంలో, మన జీన్స్ లో ఉందని, అందుకే మనవారు ఎక్కడైనా రాణించగలుగుతున్నారని అటువంటి సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలని అన్నారు.
మరో అతిధి డిఆర్‍డిఓ చైర్మన్ జీ. సతీష్ రెడ్డి మాట్లాడుతూ "అభివృద్ధి చెందిన దేశాలు తమ పిల్లలకు శాస్త్ర పరిజ్ఞానాన్ని మాతృ భాషలోనే బోధించి విజయం సాధించాయని, మనం కూడా మాతృ భాషలోనే పిల్లలకు విద్య బోధించాలని, కరోనా కష్టకాలంలో రికార్డు స్థాయిలో మాస్కులు, రక్షణ పరికరాలు తయారు చేసిన ఘనత డిఆర్డిఓ కు దక్కుతుందని, లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత పరిశ్రమను రక్షించుకోవాలని” అన్నారు.
తెలంగాణ సాంస్కృతిక మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలోని 100 సంస్థలను కలుపుకొని తెలుగు భాష అభివృద్ధికి తానా చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకు ఆదరణ తగ్గుతుందేమో కానీ విదేశాలలోని సంస్థలు మాత్రం తెలుగు పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాయని వారందరికీ అభినందనలు తెలుపుతున్నానన చెప్పారు.
లోక్ సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న కష్టకాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని దాన్ని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న తానా వారిని అభినందించారు. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా భాష కొత్త పదాలను సృష్టించుకుని విస్తరించాలని లేకపోతే అది మృతభాష అవుతుందని, తెలుగు భాషకు నాలుగు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని, ద్రావిడ భాషలకు తెలుగు భాష మూలమని, మాతృ భాషలోనే బోధన చేయడం శాస్త్రీయమైన పద్ధతి” అని ఆయన తెలియజేశారు.
ఎపిఎన్‍ఆర్‍టీ చైర్మన్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ కోవిడ్ సమస్య లో కూడా అంతర్జాలంలో తానా చేస్తున్న కార్యక్రమాలు బావున్నాయని అంటూ తానా తెలుగు భాషకు చేస్తున్న కృషిని అభినందించారు.
తానా మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి మాట్లాడుతూ, తానా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంపట్ల ఆనందాన్ని ప్రకటిస్తూ నిర్వాహకులను అభినందించారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ భారతదేశంలో భారతీయులు మాట్లాడే రెండవ అతి పెద్ద భాష తెలుగు భాష. ఈ భాష ప్రపంచం మొత్తం విస్తరించింది. విభేదాలను వీడి తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేసి తెలుగు సంస్కృతిని ప్రపంచానికి దాటాలని అన్నారు.
పద్మశ్రీ చింతకింది మల్లేశం మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఆసు మిషన్లు అందించి వేల కుటుంబాలను ఆదుకున్నందుకు తానా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
భారతీయం సత్యవాణి మాట్లాడుతూ మాతృభాష అభివృద్ధి కోసం తానాతో పాటు ఈ సంస్థలన్నీ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందించారు.
కార్యక్రమంలో మీగడ రామలింగస్వామి, గుమ్మడి గోపాలకృష్ణ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు సంఘాల అధ్యక్షులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు.