అంగరంగ వైభవంగా టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకలు
పాటలు, ఆటలు, అతిధుల ప్రసంగాలతో ఆకట్టుకున్న కార్యక్రమాలు
న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 50 సంవత్సరాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. మొదటి నుంచి తెలుగు భాషకు, మన సంస్కృతికీ పెద్దపీట వేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న టిఎల్‌సిఎ ఈసారి స్వర్ణోత్సవ వేడుకల్లో కూడా తన వైభవాన్ని, తన ఆశయాన్ని చాటుతూ కార్యక్రమాలను నిర్వహించి భళా అనిపించుకుంది. టిఎల్‌సిఎ ప్రెసిడెంట్ ఉదయ్ దొమ్మరాజు, బోర్డ్ చైర్మన్ వెంకటేష్ ముత్యాల వారి కార్యవర్గం ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు మొదటి నుంచి చేసిన కృషి విజయవంతమైంది. ఫ్లషింగ్‌లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికాలో ఈ వేడుకలను శనివారం 20 నవంబర్ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించారు.
వేద మంత్రోచ్ఛారణలతో, వేద ఆశీర్వచనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్‌మెన్ థామస్ రిచర్డ్ స్వాజీ, న్యూజెర్సి పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆఫీసు నుంచి ప్రతినిధిగా దిలీప్ చౌహాన్, ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సహస్రావధాని, అవధాన సమ్రాట్ మేడసాని మోహన్, సినీ నటి మాన్వ హాజరయ్యారు.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 150మందికిపైగా కళాకారులు చిన్నారులు, పెద్దలు ఈ వేడుకల్లో తమ కళాప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. టిఎల్‌సిఎ గోల్డెన్ జూబ్లి వేడుకలకోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వాగతగీతం అందరినీ ఆకట్టుకుంది. దీపావళి సాంగ్ అలరించింది. స్వర్ణకమలం పేరుతో ప్రదర్శించిన మరో సాంస్కృతిక కార్యక్రమం కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలతో సాగిన టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా నేపథ్య గాయనీగాయకులు పాడిన ఉత్సాహాన్ని తెప్పించే సినీ పాటలు అహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించాయి.
ఈ వేడుకల్లో టిఎల్‌సిఎ ప్రెసిడెంట్ ఉదయ్ దొమ్మరాజు మాట్లాడుతూ, తెలుగు భాషకు, తెలుగు కళలకు, కమ్యూనిటీకి టిఎల్‌సిఎ చేస్తున్న సేవలను, కార్యక్రమాలను వివరించారు. 50 ఏళ్ళ క్రితం ఎన్నో విలువలతో మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సంస్థ నేటికీ కమ్యూనిటీలో బలంగా ఉండటానికి కారణం గతంలో పనిచేసిన ప్రెసిడెంట్‌లు, వారి కార్యవర్గం చేసిన కృషే కారణం. అలాగే వారు చూపిన దారిలోనే నా హయాంలో కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి తెలుగువారికి, తెలుగు అసోసియేషన్‌లకు మాతృకగా టిఎల్‌సిఎ ఉండేలా కృషి చేశాను. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మరోవైపు నేటితరానికి ఉపయోగపడేలా వాటికి సాంకేతికను జోడిరచి నిర్వహించడం వల్ల ఎంతోమంది యువతకు టిఎల్‌సిఎ చేరువయ్యేలా చేశాను. తెలుగుభాష, సాహిత్యం వైభవాన్ని ప్రదర్శించడంతోపాటు వాటిని వచ్చే తరం కూడా పాటించేలా చేయడానికి నావంతుగా కృషి చేశాను. కోవిడ్ సమయంలో కూడా మనం ఎప్పుడూ నిర్వహించే సంక్రాంతి, ఉగాది వంటి కార్యక్రమాలను అంతర్జాల వేదికపై మరింత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనమందరం ఒకే వేదికపై చాలారోజుల తరువాత కలిసే అవకాశాన్ని టిఎల్‌సిఎ గోల్డెన్‌జూబ్లి వేడుకలు కల్పించింది. ఈ వేడుకలకు విచ్చేసిన అతిధులకు, ప్రముఖులకు, వేడుకల నిర్వహణకు సహకరించిన దాతలు విజయవంతం చేసిన అందరికీ నా తరపున నా కార్యవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బోర్డ్ చైర్మన్ వెంకటేష్ ముత్యాల, వారి కార్యవర్గం ఈ విషయంలో అందించిన సహకారం మరవలేనిది. అందరికీ మరోసారి ధన్యవాదాలు అని ఉదయ్ దొమ్మరాజు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ గోల్డెన్ జూబ్లి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు వెలుగు సావనీర్‌ను కూడా అతిధుల సమక్షంలో ఆవిష్కరించారు. అతిధులకు, శ్రేయోభిలాషులకు మంచి కానుకలను కూడా టీఎల్‌సిఎ అందించింది. వేడుకల్లో పలు కార్యక్రమాలతోపాటు పోటీలను కూడా సంఘం నిర్వహించింది. సుమంగళి, శ్రీకాంత్ సందుగు, కుమారి మౌనిమ పాటల కార్యక్రమం అలరించింది. డిఎస్‌పి కూడా తనదైన శైలిలో వచ్చినవారిని ఉల్లాసపరిచారు. టిఎల్‌సిఎ మాజీ ప్రెసిడెంట్‌లను, ముఖ్య అతిధులను ఘనంగా సన్మానించారు. జయప్రకాశ్ ఇంజపూరి ఆధ్వర్వంలో టిఎల్‌సిఎ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా ఈ వేడుకల్లో జరిగింది. జాతీయగీతంతో కార్యక్రమాలు ముగిశాయి.