థమన్ సంగీత విభావరితో ముగిసిన టిటిఎ మహాసభలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మెగా కన్వెన్షన్ సియాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 24 నుంచి 3రోజులపాటు జరిగిన మహాసభలు చివరిరోజున థమన్ సంగీత విభావరితో ఘనంగా ముగిశాయి. మే 26వ తేదీన పలు కార్యక్రమాలను, భద్రాచల సీతారాముల కళాణోత్సవం, బిజినెస్ సెమినార్‌లు, టిటిఎ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పేజియంట్ ఫైనల్స్, వివిధ పార్టీలసమావేశాలు, ఫిట్ నెస్ వర్కషాప్, ఇతర కార్యక్రమాలు జరిగాయి. భధ్రాచలం నుంచి వచ్చిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవంను వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం అందరూ ప్రసాదం అందుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కనువిందు చేశాయి. టిటిఎ నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులను పెద్దల చేతుల మీదుగా అందజేశారు. డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మూడవరోజున సందడి చేశారు. క్రౌడ్ డాన్స్ చేయాలని కోరగా, సున్నితంగా తిరస్కరించి, తనదైన స్టైల్ లో సినిమా డైలాగ్‌లు చెప్పి నవ్వులు పూయించారు. యాంకర్స్ సుమ, రవి అందరినీ నవ్విస్తూ కార్యక్రమాలను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. యువత శ్రీలీల, డీజీ టిల్లుతో సెల్ఫీలు దిగడానికి చాలామంది ముందుకు వచ్చారు.
టిటిఎ ప్రస్తుత అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజులను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. చివరన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత కచేరి వైభవంగా జరిగింది. హిట్టయిన పాటలను పాడి అందరినీ అలరించారు.