అలరించిన ‘గాటా’ దీపావళి వేడుకలు
గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ (గాటా) వారి దీపావళి వేడుకలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 18వ తేదీన సౌత్ పోర్సిత్ హైస్కూల్‌లో రాపిడిట్, ఓర్పిన్, స్వప్న ఇండియన్ కుజిన్ వారి సహాయసహకారాలతో నిర్వహించిన ఈ వేడుకలకు దాదాపు 1500 మందికి పైగా హాజరయ్యారు. ఆడపడుచుల అద్వితీయ నృత్య ప్రదర్శనలు, పెద్దల హృదయ పూర్వక అభినందనల ఆశీర్వాదాలు, అబ్బురపరిచే చిన్నారుల కళా ప్రదర్శనలు, పురుషుల ఈలలతో, వీక్షకుల కరతాళధ్వనులతో వేడుకలు జరిగిన ప్రాంతం సందడిగా కనిపించింది. నిర్వాహకుల అద్భుత ఆతిధ్యం, విక్రయదారుల షాపింగ్ స్టాల్స్ ఆకట్టుకుంది.
మిమిక్రీ రమేష్ మిమిక్రీ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తోబుట్టువులైన చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు మరియు బెస్ట్ కపుల్ డ్రెస్ పోటీలు ఆకర్షణీయంగా అందరినీ అలరించాయి. ప్రతిభా ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఆర్ట్ పోటీలలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు పిల్లల కళా నైపుణ్యం అందరినీ ఆకర్షించగా, విజేతల నిర్ణయం న్యాయనిర్ణేతలకు పరీక్షగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. వయస్సు అనుగుణంగా మూడు విభాగాలలో ముగ్గురు విజేతలకు బహుమతులను అందజేసారు.
యాంకర్ మాధవి దాస్యం, సరిత చెక్కిళ్ళ, శ్రావణి రాచకుల్ల, జోషిత గలగల మాటల అల్లరి, నోరూరించే విందు, హృదయాన్ని హద్దుకునే స్నేహపూరిత ఆతిథ్యం, అనునిత్యం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాల సందడ్లతో గాటా దీపావళి పండుగ వేడుకలు అదరహో అనిపించుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా గాటా బోర్డు నూతన సభ్యుల పరిచయం, వివిధ సంస్ధల అధినేతల సత్కారం, చివరిగా గాటా 2023 అధ్యక్షులు టిఎస్‌ఆర్ గారి కృతజ్ఞతా ప్రతిపాదనతో ఆసాంతం అత్యద్భుతంగా గాటా దీపావళి వేడుకలు అలరించాయి.