ASBL Koncept Ambience

జి.ఆర్.టి.ఏ ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు విజయవంతం

జి.ఆర్.టి.ఏ ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు విజయవంతం

రిచ్‌మండ్‌ నగరంలో తెలుగువాళ్ళు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు, శ్రీరామనవమి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రేటర్‌ రిచ్‌మండ్‌ తెలుగు అసోసియేషన్‌ (జి.ఆర్‌.టి.ఏ.) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది మరియు శ్రీరామ నవమి 2022 వేడుకలు మే 7వ తేదీన, డీప్‌ రన్‌ హైస్కూల్‌ లో కన్నుల పండుగగా జరిగాయి. జి. ఆర్‌. టి. ఏ. అధ్యక్షుడు విజయ్‌ వేమూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకి దాదాపు 800 మంది హాజరుకాగా 7 గంటలపాటు జరిగిన కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ వేడుకలో కళాకారులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని ప్రేక్షకులని అలరించారు. శ్రీ గణేషుని పాటతో మొదలైన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, పాటలు, సాంప్రదాయ, సినీ నృత్యాలు, ఇన్స్ట్రుమెంటల్‌, వంటి వైవిధ్య భరితమైన దాదాపు 33 వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో వ్యక్తిగత మరియు బృంద గానాలు, వ్యకిగత మరియు బృంద నృత్యాలు, పియానో వాద్య ప్రదర్శన, నాటికలు ప్రదర్శింపబడ్డాయి. భక్తి గేయాలు, జానపద గేయాలు, సినిమా పాటలకు ఆడి పాడి సాయంత్రాన్ని ఆహ్లాదభరితం చేసారు. అతిధులు అందరికీ పసందైన విందు భొజనం ఏర్పాటు చేసారు.

అధ్యక్షులు విజయ్‌ వేమూరి ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు ఉత్సవాలలో పాల్గొన్న అందరికీ మరియు తెలుగు నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, కృతజ్ఞతాభివందనములు అందించారు. ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్యవర్గానికి, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి యెనిక, కోశాధికారి సుధీంద్ర అయ్యంపాలయం, ప్రధాన కార్యదర్శి విజయ్‌ బైర, సాంస్కృతిక కార్యదర్శి మధుసూధన్‌ రెడ్డి, జి. ఆర్‌. టి. ఏ. కార్యవర్గ సభ్యులు మరియు ఇతర సభ్యులు పాల్గొని విజయవంతం చేసారు. హసిత వజినపెల్లి, జ్యోతిక చెన్న, చార్వి హంస కొండూరు మరియు శ్రేయ వేమూరి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

 

Click here for Event Gallery

 

 

Tags :