జీటీఏ డెట్రాయిట్ అధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ), డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలను అందంగా పేర్చి.. గౌరీ దేవిని పూజిస్తూ జానపద ఆటపాటలతో సందడి చేశారు. డెట్రాయిట్‌లోని తెలంగాణ సమాజం తమ వారసత్వాన్ని ఇతరులతో పంచుకొనేందుకు ఇదో గొప్ప అవకాశమని పలువురు మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేయాలనే సంకల్పంతో నిర్వాహకులు ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు రుచికరమైన ఆహారం అందించడంతో పాటు ఫేస్ పెయింటింగ్ వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ బతుకమ్మ ఆడేందుకు వచ్చిన వారిని ఆకర్షించాయి. దాదాపు 1500 మంది నోవి సివిక్‌సెంటర్ భవనం వద్దకు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుష్మా పదుకొణె, సుమ కలువల, స్వప్న చింతపల్లిలతో కూడిన నిర్వాహక కమిటీ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిర్వహించడంలో అద్భుతంగా పనిచేసింది. ఈ కృషిలో వీరికి జీటీఏ యూఎస్‌ఏ ట్రస్టీఈల బోర్డు, డెట్రాయిట్ నగర విభాగం ఎగ్జిక్యూటివ్, వర్కింగ్, అడ్వైజరీ, నేషనల్ స్టాండింగ్ కమిటీలు, వాలంటీర్లు సహకరించాయి. కమల్ పిన్నపురెడ్డి, వెంకట్ వదనాల, లక్ష్మీనారాయణ కర్నాల, మధుసూధన్ రెడ్డి మాలుగారి, సత్యధీర్ గంగసాని, శ్రీరామ్ జాల, కరుణాకర్ కందుకూరి, యుగంధర్ భూమిరెడ్డి, యాదగిరి ఐలేని, వెంకట్ నటాల, ప్రేమ్ రెడ్డి చింతపల్లి, అరుణ్ బచ్చు, వినోద్ ఆత్మకూర్, డాక్టర్ రాకేష్ లట్టుపల్లి, మహేశ్ బాబు బురుల్లు, సురేందర్ నాగిరెడ్డి, సాయినాథ్ లచ్చిరెడ్డిగారి, సందీప్ నారాయణప్ప, గోవింద రాజన్ తట్టాయి, రాహుల్ పాల్‌రెడ్డి, అభిలాష్ భూమిరెడ్డి, రమాకాంత్ భానూరి తమ వంతు సహకారం అందించారు.
ఈ వేడుకలు నిర్వహించడంలో దాదాపు 50 మంది వాలంటీర్లు సహకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జీటీఏ ప్రెసిడెంట్ ప్రవీణ్ కేసిరెడ్డి మాట్లాడుతూ.. నగరంలో తొలిసారి నిర్వహించిన బతుకమ్మ పండగకు అపూర్వమైన స్పందన వచ్చిందన్నారు. జీటీఏ నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరించినందుకు వివిధ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు ఆయన జ్ఞాపికలు అందజేశారు.