జిడబ్ల్యుటీసిఎస్ దీపావళి వేడుకల్లో అలరించిన సునీత సంగీత విభావరి
వాషింగ్టన్‌డీసీలో దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) ఆధ్వర్యంలో యాష్‌బర్న్‌లోని స్టోన్‌బ్రిడ్జ్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలను వైభవంగా జరిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గాయని సునీత సంగీత విభావరి అందరినీ పరవశింపజేసింది. అమెరికన్ రాజకీయ నాయకులతోపాటు తానా ప్రముఖులు, మేరీల్యాండ్, డీసీ, వర్జీనియాకు చెందిన ఎంతోమంది ఈ వేడుకలకు హాజరయ్యారు.
సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మన్నె మాట్లాడుతూ, ఈ వేడుకలకు వచ్చిన ప్రముఖులకు, ఇతరులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన పాలడుగు సాయిసుధను అందరికీ పరిచయం చేశారు. సంస్థ అభ్యున్నతికి తోడ్పడిన పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శంగవరపు, ఫౌండేషన్ కార్యదర్శి రవి మందలపు, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ప్రసాద్ తోటకూర, సూరపనేని సత్య, రావు సత్తిరాజు, ఉప్పుటూరి రాంచౌదరి, కోయా రమాకాంత్, నాగిరెడ్డి, కొల్లా సుబ్బారావు, నాయుడు, కంతేటి త్రిలోక్, మన్నవ సుబ్బారావు, కొడాలి నరేన్, లక్ష్మీ దేవినేని, తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలతో పాటు తానా ఆధ్వర్యంలో సీపీఆర్ పద్ధతిపై శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గుండెపోటు ప్రమాద సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడే సీపీఆర్ పద్ధతిపై ఈ కార్యక్రమంలో సీపీఆర్ పద్ధతిని అమలు చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై శిక్షకులు సలహాలు, సూచనలు అందజేశారు.