ఘనంగా హ్యూస్టన్ తెలుగు సంఘం ఉగాది వేడుకలు
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఏప్రిల్ 23వ తేదీన నిర్వహించింది. తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక సమితి అధ్యక్షురాలు ఆశాజ్యోతి దేవకి, జనరల్ సెక్రటరీ: మైథిలి చాగంటి, ట్రెజరర్: రవి గునిశెట్టి, కల్చరల్ సెక్రటరీ: స్నేహ రెడ్డి చిర్ర, వెబ్ అండ్ కమ్యూనికేషన్స్: రత్నాకర్ మోడేకృత్తి, లిటరరీ కోఆర్డినేటర్: రామకృష్ణ గొడవర్తి, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇంఛార్జ్: శ్రీనివాస్ నూతలపాటి, ధర్మకర్తలు: శ్రీధర్ దాడి, ఇందిర చెరువు, శ్రవణ్ ఎర్ర జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది.
వేద మంత్రముల నడుమ, రెప్రజంటేటివ్ ఎడ్ థాంమ్సన్‌తో పాటుగా 2023-24 సంవత్సరముల కార్య నిర్వాహక వర్గము, ధర్మకర్తలు వేదికను అలంకరించారు. కర్ణాటక సంగీతము, శాస్త్రీయ సంగీతము, నాట్యము, సినిమా పాటలు, డ్యాన్సులు, తెలుగు నాటికలు, ఫ్యాషన్ షోలు ప్రదర్శించారు. పియర్ ల్యాండ్‌కు ఎన్నికైన మేయర్ కోల్, జడ్జ్ పాటిల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మణిశాస్త్రి, సుధేష్ పిల్లుట్ల, స్రవంతి మొదలి, స్వ్రరాజ్ శివరామ్, శ్రీధర్ కంచకుంట్లను ఆయా రంగాలలో వారుచేసిన, చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఘనంగ సత్కరించారు. ఉగాది పర్వదిన ప్రత్యేకతలను విశిష్టతలను వివరిస్తూ వారు చేసిన ప్రసంగాలు విజ్ఞాన దాయకమే గాక మనలో స్ఫూర్తిని రగిలించేవిగా ఉన్నాయి. ఈ ఉగాది వేడుకలను నిర్వహించడంలో సహ ఆతిథ్య బాధ్యతను తీసుకున్న శ్రీ మీనాక్షీ అమ్మవారి గుడి యాజమాన్యపు సహకా రాన్ని అసోసియేషన్ నాయకులు ప్రశంసిం చారు. ఆలయ కమిటీ చైర్మన్ వినోద్ రెడ్డి కైలా మాట్లాడు తూ, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 1977వ సంవత్సరం నుండి ఒకదానికొకటి సహకరించు కుంటూ ముందుకు సాగుతోందని ప్రశంసించారు.
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి అనుబంధ సంస్థ ‘తెలుగు బడి’ విద్యార్ధులు వారి ప్రదర్శనల ద్వారా వారి నైపుణ్యాలను ప్రదర్శించడమే గాక, తెలుగు భాషను అందిస్తున్న గురువులను తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక వర్గం సత్కరించడం అభినందనీయం. తెలుగు సాంస్కృతిక సమితి యొక్క స్వర మాధురి విద్యార్ధులు, తెలుగు సినిమా దర్శకులు, కె. విశ్వనాధ్‌కి నివాళులర్పిస్తూ చేసిన ప్రదర్శన నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. బావర్చి బిర్యాని వారందించిన విందు భోజనమారగించాక స్థానికులైన హర్ష, ప్రియ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగ నిర్వహించిన 2023-24 సంవత్సరానికి ఎన్నికైన కార్యనిర్వాహక వర్గాన్ని వేదిక మీద పరిచయం చేయడం జరిగింది.