ASBL Koncept Ambience

వైభవంగా హ్యూస్టన్ ఉగాది వేడుకలు

వైభవంగా హ్యూస్టన్ ఉగాది వేడుకలు

అమెరికా ఆనవాయితీ ప్రకారం పండగ ఎప్పుడయినా దాన్ని జరుపుకునేది మాకు అన్నీ కుదిరిన వారాంతంలోనే. అదే పద్దతిలో మా హ్యూస్థన్‌ తెలుగు సాంస్క తిక సమితి నిర్వహణలో మార్చ్‌ 24 నాడు స్థానిక శ్రీ మీనాక్షీ దేవాలయం లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మా మరొక ఆనవవాయితీ ప్రకారం సంక్రాంతి సమయంలో ఎన్నుకున్న నూతన కార్య నిర్వాహక వర్గానికి ఇదే మొదటి భారీ కార్యక్రమం కాబట్టి వారి నిర్వహణా చాతుర్యాన్ని నిరూపించుకోడానికి ఇదే మొదటి అవకాశం. ఆ అవకాశాన్ని ఈ ఏడు అధ్యక్షుడిగా ఎన్నిక అయిన కిరణ్‌ మద్దినేని, కార్య నిర్వాహక సభ్యులు రాము ఉప్పలపాటి, మంతెన శ్రీనివాస్‌, జానకి పేరి, ఇందిర చెరువు, మనోజ్‌ పాలడుగు, వినోద్‌ ఉదత్వార్‌, రఘు కణితి, పూర్వాధ్యక్షుడు బ్రహ్మ బెరివీర -ఎంతో కష్టపడి ఉత్సాహంతో మా సంస్థ ధర్మకర్తలు రవి తమిరిశ, మారుతీ రెడ్డి, ఐనంపూడి కనకం బాబు గార్ల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రీ హనుమాన్‌ స్వామి గారి ఉగాది పంచాగ శ్రవణం తో ఈ కార్యక్రమం ప్రారంభం అయింది.

ఈ ఏడు సాంస్క తిక కార్యదర్శులు జానకి పేరి (ప్రధాన నిర్వాహకురాలు), మంతెన శ్రీనివాస్‌ తదితరుల సహాయంతో ప్రదర్శనకి సుమారు పాతిక అంశాల కి కుదించి, అందులో అధిక శాతం చిన్నారుల అంశాలకే పెద్ద పీట వెయ్యడం ఈ సారి నాకు బాగా నచ్చిన అంశం. పైగా వాటిల్లో కూడా సినిమా యవ్వారాలు చాలా తక్కువ. బాల బాలికలు పాడిన పాటలు కానీ, వేసిన చిన్న చిన్న నాటికలు కానీ మంచి తెలుగు సంప్రదాయాన్నీ, సంస్క తినీ ప్రతిబింబించాయి.

ఉదాహరణకి తెలుగు బడి పిల్లల చేత లంక మురళి రూ పొందించి వేయించిన ''మన కవులు'' అనే అంశం లో అలనాటి నన్నయ నుంచి ఈ నాటి గద్దర్‌ దాకా కవులని పరిచయం చేసిన అంశం బావుంది. అలాగే స్వర మాధురి బ ందం చిన్నారుల పాటలు బావున్నాయి. అలా అని ''యూతు ఐటమ్స్‌'' (ఈ మాట నాకు భలే చికాకు...హాయిగా యువత అనకుండా యూతు ఏమిటీ నా బొంద)..లేవా అంటే ఉన్నాయి. ఒకానొక డేన్స్‌ కంపెనీ వారట వాళ్ళు చెమ్కీ బట్టలు వేసుకునీ, రఘు కణితి బ ందం శ్రీదేవి కి అంకితం ఇస్తూ చేసిన ''అబ్బ నీ తియ్యనీ దెబ్బ'' మెడ్లీ లాంటి స్టెప్పుల డాన్సులూ తగిన మోతాదులో ఉన్నాయి. అలాంటి స్టెప్పు లు నేను వేస్తే రెండు నెలలు హాస్పిటల్‌ నివాసం ఖాయం. సాంస్క తిక కార్యక్రమాలకి ఆఖరి అంశం గా ఆత్మీయులు పల్లవి, శివ జూటూరి స్వయంగా వ్రాసి ప్రదర్శించిన చిన్న హాస్య నాటిక మంచి హాయిగా నవ్వించింది.  ఈ కార్యక్రమాలన్నింటినీ జానకి పేరి, మంతెన శ్రీనివాస్‌ సమర్ధవంతంగా నిర్వహించగా ఇందిర చెరువు తదితరులు ఎంతో సహకరించారు.

ఈ ఉగాది వేడుకలలో నాకు నచ్చిన ఒక అంశం అధ్యక్షుడు కిరణ్‌ మద్దినేని తన ప్రసంగంలో ఈ ఏడు ఏయే కార్యక్రమాలు ఏయే తీదీలలో ముందు గానే ప్రకటించడం (వాగ్గేయకారోత్సవం, భాగవతం ఆణిముత్యాల పోటీ, పిల్లలకోసం తెలుగు, వన భోజనాలు, తెలుగు భాషా పోటీలు, సంక్రాంతి) ఒక ఎత్తు అయితే తెలుగు వాహిని అనే పేరిట ఒక సంస్థాగత మాస పత్రిక, తెలుగు ప్రముఖులని వీడియో ద్వారా పరిచయం చెయ్యడానికి ఒక యూ ట్యూ బ్‌ చానెల్‌ ని ఈ ఏడు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ రెండు నూతన ప్రక్రియలకీ సూత్రధారుడిగా సుధేష్‌ పిల్లుట్ల వ్యవహరిస్తున్నట్టు తెలిసి ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సుధేష్‌ సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, నాట్య, నాటక రంగాలలో నిష్ణాతుడు, సవ్య సాచి, నిరంతర సాంస్క తిక, సమాజ సేవాభిలాషి, భారతీయ వాహిని అనే సంస్థ వ్యవస్థాపకుడు.. నాకు ఆత్మీయుడు.

ఎందుకో తెలియదు కానీ మొట్ట మొదటి ''తెలుగు వాహిని'' సంచిక ని సభా ముఖంగా ఆవిష్కరించే ఆవకాశం నాకు ఇచ్చారు...పనిలో పనిగా నేను వ్రాసిన ''అమెరి ''కట్టు కథ''లూ -కమామీషులూ కూడా ఈ సందర్భంగా అమెరికాలో మొదటి సారి ఆవిష్కరణ జరిగింది. ఇది మటుకు ఎందుకో నాకు తెలుసు. కవులని, పండితులని ఆహ్వానించడం, తెలుగు పుస్తకాలు ఆవిష్కరించడం లాంటి సాహిత్యపరమైన అంశాలకి సాంస్క తిక కార్యక్రమాలలో చోటు కల్పించకపోవడం ఈ నాడు అన్ని చోట్లా అలవాటు అయిపోయింది.

కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నిర్వాహకులని మొహమాట పెట్టేసి నా పుస్తకావిష్కరణ నేనే చేసుకుని సాహిత్యానికి చిన్న చాటింపు చేశాను. నాకు తోడుగా సహా సాహితీవేత్తలైన ఉమా భారతి, శాయి రాచకొండ, సుధేష్‌ లు కూడా వేదిక ని అలంకరించారు.

ఈ ఉగాది వేడుకలలో మరొక ప్రధానాంశం డా. పి. శ్యామసుందర రావు గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం. ఆయన గత యాభై ఏళ్లగా హ్యూస్టన్‌ లో ఉంటున్న సుప్రసిద్డ పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌. ఆ స్పెషాలిటీ లో నిష్ణాతులైన డాక్టర్లు యావత్‌ ప్రపంచలోనే పది మంది లోపే. వారిలో ఆయన తొలి తరం వారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మా టీసీయే వారు తెలుగు తేజం పేరిట ఇది వరలో కూడా కొంత మందిని (నాతో సహా) గుర్తించి గౌరవించినా సాంస్క తిక రంగానికి చెందిన వారే కానీ వ త్తి రీత్యా అత్యున్నత స్థాయికి చేరుకున్న తెలుగు వారిని గుర్తించడం ఇదే మొదటి సారి అనుకుంటాను.

ఇక ఉగాది వేడుకలకి ఆఖరి అంశంగా మా హ్యూస్థన్‌ గాయని 'గాన కోకిల'' శారద ఆకునూరి ప్రధాన గాయనిగా, న్యూ జెర్సీ కి చెందిన ప్రసాద్‌ సింహాద్రి, స్నేహ మొక్కాల, సాయ వచన్‌ తదితరులు సుమారు గంటన్నర సేపు మంచి మంచి సినిమా పాటలతో అందరినీ అలరించారు అనీ, కొన్ని పాటలకి ''యూతు'' స్టేజ్‌ మీదకి వచ్చి స్టెప్పులు వేసి ''జోష్‌'' చేసారు అనీ, సుమారు 30 నిముషాలు స్వర్గీయ శ్రీదేవి స్మ త్యర్ధం ఆమె పాటలు పాడారు.

Click here for Event Gallery

 

Tags :