ASBL Koncept Ambience

అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ ఇప్పుడు గమ్యస్థానమే...

అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ ఇప్పుడు గమ్యస్థానమే...

అమెరికా పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మంత్రి కేటీఆర్‌

భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు కన్నా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ నగరమే ఇప్పుడు ఐటీకి ప్రధాన కేంద్రంగా మారుతున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌ తదితర అనేక పెద్ద కంపెనీలు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి (టైర్‌-2) పట్టణాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌హోసెలో ఐటీ సెర్వ్‌ అలయెన్‌ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో క్వాల్కామ్‌ సంస్థ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిందని చెప్పారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. 

హైదరాబాద్‌ నగరం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఐటీ రంగం హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, మాదాపూర్‌లకు పరిమితం కాకుండా ఉప్పల్‌, ఎల్బీనగర్‌ వంటి తూర్పు, కండ్లకోయ వంటి ఉత్తర ప్రాంతాలకు కూడా విస్తరించింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ వంటి ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఈ పరిశ్రమ విస్తరిస్తున్నది. ఈ నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటుచేసి ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యం కల్పిస్తున్నాం. రూరల్‌ టెక్‌ పాలసీలో భాగంగా వచ్చే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగాలు ఈ టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో కంపెనీ ఏర్పాటుచేసుకొనే వీలున్నది. రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటుచేసి సాధ్యమైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించండి. మీరే తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్లు. మీ ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

లూసిడ్‌ మోటార్స్‌ సీఈవోతో కేటీఆర్‌ 

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ లూసిడ్‌ మోటర్స్‌ సీఈవో, సీటీవో పీటర్‌ రాలిన్సన్‌, సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ హాకిన్స్‌తో మంత్రి కేటీఆర్‌ శాన్‌ హోసెలో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగానికి ఉన్న అవకాశాలను, రాష్ట్రంలోని సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధిని వారికి వివరించారు.

ఐప్లెడ్‌ మెటీరియల్స్‌ ఉపాధ్యక్షుడితో...

శాన్‌హోసె పర్యటనలో భాగంగా ఐప్లెడ్‌ మెటీరియల్స్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, సీటీవో ఓమ్‌ నలమసుతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో అమలుచేస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, పరిశోధన-అభివృద్ధి, కాంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో హైదరాబాద్‌లోని అవకాశాలను ఆయనకు వివరించారు. ఐప్లెడ్‌ మెటీరియల్స్‌ సంస్థ సెమీ కండక్టర్లు, ఫ్లాట్‌ ప్యానల్‌ డిస్‌ప్లే, సోలార్‌ ఫొటో ఓల్టిక్‌ సేల్స్‌ తదితర ఉత్పత్తులకు సంబంధించిన మెటీరియల్స్‌, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్నది.

హైదరాబాద్‌లో తయారీ సంస్థ ఏర్పాటుకు కన్‌ఫ్లూయెంట్‌ అంగీకారం

ప్రపంచ ప్రఖ్యాత మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీ కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పైలట్‌ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏడాదిలో భారీగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ చైర్మన్‌, సీఈవో డీన్‌ షావర్‌ ఈ మేరకు ప్రకటించారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత అధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్‌ టెక్స్‌టైల్‌ సేవలకు సంబంధించి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. తమ తయారీ యూనిట్‌ ఏర్పాటు కోసం హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్న కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరఫున తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కాగా, కన్‌ఫ్లూయెంట్‌ సంస్థ.. నింతోల్‌ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌కు తీసుకురానుంది. దీంతో దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా కన్‌ఫ్లోయంట్‌ మెడికల్‌ నిలవనున్నది. దేశంలోని మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. హైదరాబాద్‌లో స్థాపించబోయే తన తయారీ యూనిట్‌ ద్వారా భారతదేశంతో పాటు ఆసియాలోని సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నది.

భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫిష్‌ఇన్‌ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ఫిష్‌ ఇన్‌ కంపెనీ తెలంగాణలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడిరచింది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం కంపెనీ సీఈఓ మనీష్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటించారు. రూ. వెయ్యి కోట్లతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని వెల్లడిరచారు. దీంతో ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని మనీష్‌ కుమార్‌ తెలిపారు. చేపల ఉత్పత్తిలో హ్యాచరీలు, దాణా తయారీ, కేజ్‌ కల్చర్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ప్రతి ఏడాది రాష్ట్రం నుంచి సుమారు 85 వేల మెట్రిక్‌ టన్నుల చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫిష్‌ ఇన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అందివస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్‌ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించామని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ పాల్గొన్నారు.

ఫిస్కర్‌ ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్‌.. హైదరాబాద్‌లో ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లాస్‌ ఏంజెల్స్‌లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్‌ ఫిష్కర్‌, సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌తో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్‌ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ వివరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జడ్‌ఎఫ్‌, హుండాయ్‌లాంటి పలు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ టెక్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్‌ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేశారు. ఆటో మొబైల్‌ పరిశ్రమకు సంబంధించిన డిజైన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు హైదరాబాద్‌ లో అద్భుతమైన అవకాశాలున్నాయన్న కేటీఆర్‌, ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్‌ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్‌ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్‌ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్‌ లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.

తమ ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఆటో మొబైల్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు చెందిన 300 మంది టెక్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. కాగా, ఫిష్కర్‌ కంపెనీ తయారు చేసిన ఓషన్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ కారును మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు.

హైదరాబాద్‌లో క్వాల్కమ్‌ రెండో అతిపెద్ద కార్యాలయం..

సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, సెమికండక్టర్‌ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్‌ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ శాండియాగోలోని క్వాల్కమ్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాష్‌ పాల్కివాల, ఉపాధ్యక్షుడు జేమ్స్‌ జిన్‌, లక్ష్మీ రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌తో కూడిన సీనియర్‌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌ నగరంలో వివిధ దశల్లో 3904.55 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్‌ సంస్థ, తమ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్‌ నాటికి హైదరాబాద్‌ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్‌ తెలిపింది. ఈ సందర్భంగా క్వాల్కమ్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీలాంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్‌ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు ఈ విషయమై చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటనను విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న డిజిటెక్‌ సెంటర్‌లో 300 మంది సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభించనుంది. ఈ కేంద్రం డేటా అనలిటిక్స్‌తోపాటు ఆ కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఐటీ బ్యాకెండ్‌ సపోర్ట్‌ను అందించనుంది. కాగా, ఈ సమావేశంలో తెలంగాణలో స్పోర్ట్స్‌ టూరిజం, తయారీలాంటి ఇతర సహకార అవకాశాలపై చర్చించారు. డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ నగరాలను పరిశీలించిన కాల్‌అవే కంపెనీ, చివరగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం.

 

Tags :