న్యూయార్క్‌లో మోదీ బిజీ బిజీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన పలువురు ప్రపంచనేతలతో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ రంగం, ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఆయన వారితో చర్చలు జరిపారు. ముందుగా ఆయన ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తో భేటీ అయ్యారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతునిచ్చినందుకు ఆర్మేనియాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండాతో భేటీ అయిన మోదీ ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచే విషయమై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తమ దేశంలోని ప్రవాస భారతీయులు, భారతీయ విద్యార్థులు ఉభయ దేశాల మధ్య ముఖ్యమైన వారధిగా ఉంటున్నారని న్యూజిలాండ్ ప్రధాని ఆర్డెన్ పేర్కొన్నారు.
ఆ తరువాత మోదీ ఇస్తోనియా అధ్యక్షుడు కెర్‌స్టీ కల్జులైద్‌తో సమావేశమయ్యారు. ఈ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, సృజనాత్మకత రంగాల్లో ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని మోదీ, ల్జులైద్ నిర్ణయించారు. అనంతరం మోదీ బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్‌తో భేటీ అయ్యారు. బెల్జియం ప్రధానితో సమావేశం అద్భుతంగా జరిగిందని, ఉభయ దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడంపై ఇద్దరం చర్చించుకున్నామని మోదీ తెలిపారు.