సమష్టి కృషితోనే గెలుపు: ఉపేంద్ర
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన చివుకుల ఉపేంద్ర అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజెర్సి రాజకీ యాల్లో ఇప్పటికే ఎన్నో పదవులను పోషించిన ఉపేంద్రకు అమెరికా రాజకీయాలపై గట్టి పట్టు ఉంది.
లీడర్ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా వ్యవహరించడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉపేంద్ర తెలుగువాళ్ళు కూడా అవకాశం వస్తే రాజకీయాల్లో కూడా రాణిస్తారని నిరూపించారు. ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళిన ఉపేంద్ర చివుకుల సిబిఎన్ టెలివిజన్ ఛానల్‌లో ఆడియో, వీడియో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ప్రొఫెషనల్‌గా మారారు. అమెరికాలో అనేక ప్రాంతాల్లో అనేక కంపెనీల్లో ఇంజనీర్‌గా పనిచేశారు. తమ కమ్యూనిటీ హక్కులపై పోరాడేందుకు తాను ఎందుకు రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఉపేంద్ర ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎంతోమందికి సహాయం చేశారు. ఆ సహాయపడే గుణమే ఆయనను రాజకీయాల్లో రాణించేలా చేసింది. అంచెలంచెలుగా ఆయన రాజకీయాల్లో ఎదిగారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ సాధారణంగా వరుసగా రెండుసార్లు పదవిలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కన్నా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవాలని చాలామందిలో ఉన్నా ఆ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తమకు మరింత కష్టాలు ఎదురవుతాయేమోనన్న ఆందోళన ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ ఈ రెండు నెలలు సమష్టిగా కష్టపడితే విజయాన్ని మరోసారి చేజిక్కించు కోగలదని, హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంటుందని ఆయన తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుతో మాట్లాడుతూ చెప్పారు.