‘ఇండియన్ ఎడ్జ్’ ప్రదర్శన
ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త ఆవిష్కరణలు, వినూత్న పరిశ్రమలను ఈ సదస్సులో భాగంగా ఒకే గొడుగు తీసుకొచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన దాదాపు వందకుపైగా ఉత్తమ స్టార్టప్‌లకు కేంద్ర పారిశ్రామిక శాఖ ఈ అవకాశం కల్పించింది. సదస్సులో వారంతా తమ ఆలోచనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తుల గురించి చాటి చెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే హెచ్‌ఐసీసీలో ఈ ‘ఇండియన్ ఎడ్జ్’ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక దృశ్య శ్రవణ సాంకేతిక పరిజ్ఞానంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) విభాగం ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది. ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనే నినాదంతో కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తోంది. టచ్ స్క్రీన్లు, మల్టీ టచ్ ఇంటరాక్టివ్ వాల్, సెన్సర్ స్కీన్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లను వినియోగిస్తున్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ సంస్థలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం, అవకాశాలు, ప్రయోజనాలు, ఆ రంగంలో ఉన్న భవిష్యత్తు తదితర అంశాలను చాటిచెప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తులు, ఆవిష్కరణలను సైతం ప్రదర్శించేలా ఎగ్జిబిషన్‌ను అధునాతనంగా రూపొందిస్తున్నారు. సదస్సులో తొలి రోజున సాయంత్రం 4 గంటల నుంచి 4.25 వరకు ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ ఈ ప్రదర్శనను తిలకిస్తారు. ‘ది ఇండియన్ ఎడ్జ్.. అండ్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ త్రూ ఏజెస్’పేరిట ప్రదర్శనను నిర్వహిస్తారు.