కేటీఆర్ దావోస్ పర్యటన ఫలప్రదం...
దిగ్గజాలతో వరుస భేటీలు...పెట్టుబడులకు సై అన్న సంస్థలు
పిరమల్ సంస్థ పెట్టుబడి 500 కోట్లు...
దృష్టిసారించిన వ్యాపారవేత్తలు
తెలంగాణ రాష్ట్రం ఘనతను అంతర్జాతీయ తెరపై ఆవిష్కరించి, తెలంగాణవైపు విదేశీ సంస్థలు చూసేలా చేయడంలో తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు విజయం?సాధించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జనవరి 21 నుంచి 24వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రం తరపున మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దాదాపు 117 దేశాల ప్రతినిధులు.. ప్రపంచంలోనే పేరెన్నిక గల దిగ్గజ సంస్థల అధినేతలు.. అలాంటి హేమాహేమీలు పాల్గొన్న అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను కేటీఆర్ తనదైన శైలిలో ఆవిష్కరించి అబ్బురపరిచారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంస్కరణలు, తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, వివిధ రంగాలకు అందజేస్తున్న ప్రోత్సాహం గురించి కేటీఆర్ వివరిస్తుంటే.. అక్కడికి విచ్చేసిన టాప్ సీఈవోలు, వివిధ రంగాల ప్రతినిధులంతా భళా అని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రపంచాన్నే ఆకర్షించే విధంగా భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రం వినూత్న నిర్ణయాల్ని తీసుకుంటుందా? అని వారు ఆశ్చర్యపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు సానుకూలత వ్యక్తం చేయడం విశేషం.
నాలుగు రోజుల పాటు జరిగిన దావోస్‌లో జరిపిన పర్యటనలో మంత్రి కెటిఆర్ అనేక ప్రముఖ కంపెనీలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన మంత్రులను కలిశారు. తన వాక్‌చాతుర్యం, బహుముఖ ప్రతిభతో తెలంగాణకు పెట్టుబడులు రప్పించడంలో ఆయన సఫలీక తులయ్యారు. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలకు మంత్రి కెటిఆర్ ఇచ్చిన భరోసాతో వారిలో తెలంగాణ పట్ల మరింత విశ్వాసం కలిగించింది. ఈ భేటీ తరువాత రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావచ్చన్న సంకేతాలు కనిపించాయి. ఇప్పటికే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంత్రి కెటిఆర్ ఒప్పందాలను కూడా చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో దావోస్‌కు వెళ్ళిన కెటిఆర్ పర్యటన విజయవంతమైంది. మంత్రిగా ఒకవైపు రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు యత్నిస్తూనే మరోవైపు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడిగా పార్టీ నేతలకు పురపోరుపై నిత్యం దశా, దిశ నిర్దేశం చేశారు. ఇక ట్విట్టర్ ద్వారా కూడా ప్రజల సమస్యలపై కూడా స్పందిస్తూ తన బహుముఖ ప్రతిభను కెటిఆర్ చాటుకున్నారు.
దావోస్ పర్యటనలో మంత్రి కెటిఆర్ సుమారు 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆల్ఫాబెట్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, కోకకోల సిఇఒ జేమ్స్ క్వేన్సీ , సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మెన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సిఐఒ సుసాన్ వొజ్కికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు పారిశ్రామిక పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో అగ్రస్థానంలో నిలుస్తుందన్న విషయాన్ని వివరించారు. హైదరాబాద్ నగరం శీఘ్రగతిన అభివ ద్ధి చెందుతున్న తీరుని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాస్మోపాలిటన్ కల్చర్‌తో పాటు గత కొన్ని సంవత్సరాలుగా జీవించేందుకు అనువుగా ఉన్న నగరాల్లో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ ఎంపిక అవుతున్న విషయాన్ని కూడా వివరించారు.
పిరమల్ గ్రూప్ కేటీఆర్‌తో చర్చల తరువాత తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇలాగే ఇతర కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా కేటిఆర్ కృషి చేశారు. వరల్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్ ని ఏర్పాటు చేసింది. మన దేశం నుంచి మధ్యప్రదేశ్ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొన్నప్పటికీ తెలంగాణ భారీ ఎత్తున సొంత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలిగింది. మంత్రి కెటిఆర్ ప్రతినిధి బందంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం, టి హబ్ సిఇఒ రవి నారాయణ్ తదితరులు ఉన్నారు.
కెటిఆర్ తీరే ప్రత్యేకం
యువ మంత్రిగా కెటిఆర్ దావోస్‌లో పలువురు వ్యాపార వేత్తలను విశేషంగా ఆకట్టుకున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఏ విధంగా మేలు అనే విషయాన్ని సవివరంగా ఎకానిమిక్ ఫోరంలో కెటిఆర్ వివరించారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సదుపాయాలు, టిఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లోనే ఇస్తున్న అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను కెటిఆర్ అందరికీ విపులంగా వివరించారు. దీంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అన్న విశ్వాసాన్ని కేెటీఆర్ కల్పించగలిగారు.
విదేశీ మంత్రులతో, వ్యాపార ప్రముఖులతో కేటీఆర్ సమావేశాలు
దావోస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ పలువురు ప్రముఖులతో, విదేశాల మంత్రులతో, వ్యాపార వాణిజ్యవర్గాలవారితో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా ఆల్ స్వాహతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా డెన్మార్కుకు చెందిన మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ నోవో నోర్ డిస్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు క్యమీల సిల్వెస్తోతో, మైక్రాన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మహోత్ర, కోకో కోలా కంపెనీ సిఇఒ జేమ్స్ క్వెన్సి, యూ ట్యూబ్ సిఇఒ సుసాన్ ఒజ్విక్క్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీ సనొఫి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ తో. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌ఎంఇ, స్టార్టప్ శాఖల మంత్రి యంగ్ సున్‌తో, అమెజాన్ వెబ్ సర్వీసెస్, పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మైఖేల్ పుంకే, సాఫ్ట్ బ్యాంక్ సీనియర్ మేనేజింగ్ పార్టనర్ దీప్ నిషార్, నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాన్సన్, రోషే చైర్మన్ క్రిస్టోఫర్ ప్రాన్జ్, .హెచ్‌పిసిఒఒ విశాల్ లాల్, అపోలో టైర్స్ ఉపాధ్యక్షుడు, ఎండి నీరజ్ కన్వర్, కాలల్స్ బెర్గ్ గ్రూప్ చైర్మన్ ప్లెమింగ్ బెసెన్ బాచర్, పి అండ్ జి దక్షిణాసియా సియిఓ, ఎండి మాగెశ్వరన్ సురంజన్‌లతోనూ తదితరులతో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, మరియు లైఫ్ లైసెన్స్ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను తెలియజేశారు.
ఫ్యానల్ డిస్కషన్‌లో...
సిఎన్‌బిసి టివి..18, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన ఫ్యానల్ డిస్కషన్‌లో మంత్రి కెటిఆర్ పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఇండియా ఇన్వెస్టెమెంట్ అండ్ అండ్ ఇన్నోవేషన్ అంశంపై నిర్వహించిన ఈ చర్చలో మాట్లాడుతూ, ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. 20 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యువత భారత దేశానికి అద్భుతమైన బలమన్నారు. ఈ చర్చలో భాగంగా తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలు, ఇన్నోవేషన్ రంగం గురించి ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ ఏ విధంగా మేలు అనే విషయాన్ని సవివరంగా వివరించడంతోపాటు, పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సదుపాయాలు, టిఎస్ ఐపాస్ ద్వారా పదిహేను రోజుల్లోనే ఇస్తున్న అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను మంత్రి కేటీఆర్ వివరించి, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అన్న విశ్వాసాన్ని అందరిలో కల్పించేలా చేయడంలో సఫలమయ్యారు.
రాష్ట్ర మంత్రిగా దావోస్‌కు వెళ్ళిన కెటిఆర్ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా తన విధుల్లో అనువంత నిర్లక్ష్యాన్ని కూడా ఎక్కడా ప్రదర్శించలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీన 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను విజయతీరాలకు తీర్చడానికి అవసరమైన అన్ని రకాల వ్యూహాలను దావోస్ నుంచే కెటిఆర్ అమలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల కదలికలను అక్కడి నుంచే పసిగట్టి పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా వారిని కార్యోణ్ముఖులను చేశారు. ఎంత దూరంలో ఉన్నా.. ప్రజల బాగోగులపైనే ద ష్టికెటిఆర్ తన ట్విట్టర్ పోస్టులను కూడా మరిచిపోలేదు. ముఖ్యంగా దావోస్‌కు వెళుతున్న సమయంలో విమానం రావడం కొంత ఆలస్యం కావడంతో అక్కడ సామజవరగమన పాట విని తన్మయత్వం పొందారు. ఈ పాటకు సంగీతాన్ని అందించిన తమన్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అలాగే రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన శివాంశ్ అనే మూడు నెలల చిన్నారికి గుండెకు చిల్లుపడిందన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కెటిఆర్ వెంటనే తన పేషి అధికారులను అలర్ట్ చేశారు. సదరు కుటుంబానికి అండగా ఉండాలని, చిన్నారి గుండె ఆపరేషన్‌కు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామన్న హామీ ఇచ్చారు.