దక్షిణాఫ్రికా బతుకమ్మ వేడుకల్లో జే తాళ్ళూరి
దక్షిణాఫ్రికాలోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టాసా) నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జే తాళ్ళూరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు భారత హైకమీషనర్, కాన్సులర్ జనరల్ కూడా ప్రత్యేక అతిథులుగా వచ్చారు. తెలుగు వాళ్ళే కాదు, తెలుగేతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. సెప్టెంబర్ 28న జరిగిన ఈ వేడుకకు 1500 మంది తెలుగువాళ్ళు హాజరయ్యారు. సందడిగా, అట్టహాసంగా ఈ జరిగిన వేడుకల్లో 'తానా' అధ్యక్షుడు ముఖ్య అతిథిగా కీలకోపన్యాసం చేశారు. 'తానా' చేస్తున్న కషిని, సేవాకార్యక్రమాలను వివరించారు. ప్రవాస తెలుగు ప్రజలు తెలుగునేల ఋణాన్ని తీర్చుకోవాల్సిన అవసరాన్ని, ఏ రకంగా మనవంతు పాత్రని నిర్వర్తించగలమో తెలియజేశారు. సంస్థ కార్యకలాపాలని ఏ ఇబ్బందులు లేకుండా పదుగురికి ఉపయోగపడేలా ఎలా చేసుకోవచ్చో బోధించారు. ఆపైన తెలంగాణ నుండి విచ్చేసిన ప్రముఖ కళాకారులు జంగిరెడ్డి, మంగ్లీ బందం తమ పాటలతో అలరించారు.
తరువాతరోజు 'తానా' అధ్యక్షుడికి ప్రముఖ తెలుగువాళ్ళతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. దక్షిణాఫ్రికాలో తెలుగు వారి జీవనశైలి, వారు అందిపుచ్చుకునే ఉద్యోగావకాశాలు, వ్యాపార అవకాశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. తానా సంస్థ నుండి పొందిన అనుభవాలతో ఇక్కడ దక్షిణాఫ్రికాలో తెలుగు వారందరు సంఘటితంగా సమాజానికి ఏమేం చేయగలరన్న విషయాలపై జే తాళ్ళూరి సలహాలనిచ్చారు. 'తానా' పుట్టుపూర్వోత్తరాలను అందరికి వివరిస్తూ ఒక విశిష్ట సంస్థగా అది ఎదిగిన తీరుని వివరించారు. అందరితో సరదాగా కలిసిపోయి, స్నేహంగా మెలుగుతూ అందమైన అనుభూతుల్ని మిగిల్చారు.