చంద్రబాబును కలిసిన జయరాం కోమటి..బాధ్యతల స్వీకరణ
కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి సోమవారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. అమెరికాలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రికి కృతఙతలు తెలిపారు. ముఖ్యమంత్రి అభీష్టానుసారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు జయరాం కోమటి ప్రకటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం పెంచడంలోనూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముమ్మరంగా ప్రచారం చేయడంలోనూ, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలోనూ జయరామ్ కోమటి, ఆయన టీమ్ కృషి చేయాలని కోరారు.
జయరామ్ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా చూస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమెరికాలోని ఎన్నారైలకు కూడా తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జయరామ్ కోమటితోపాటు నాదెళ్ళ గంగాధర్, సతీష్ వేమన, ప్రసాద్ గారపాటి, నవనీత కృష్ణ గొర్రెపాటి, కుమార్ విదడాల, సుబ్బారావు చెన్నూరి, రత్నకుమార్ యార్లగడ్డ, రఘు మేక, భాను ముగులూరి, దినకర్ వోలేటి, విజయ్‌సారథి కొసరాజు, నవరత్న కొసరాజుతోపాటు పలువురు ఎన్నారైలు చంద్రబాబును కలిశారు.