డిజిటల్ తరగతులతో విద్యాప్రమాణాలు పెంపు - జయరామ్ కోమటి
విద్యాప్రమాణాలు పెరిగేందుకు డిజిటల్ తరగతులు దోహదపడుతాయని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి అన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారై నాగన్నపాలెంకు చెందిన రజనీకాంత్ కాకర్ల ఆధ్వర్యంలో బసవన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని 264 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో ఎపికి చెందిన 13 లక్షల మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ, పేద పిల్లలకు కూడా కార్పొరేట్ తరహాలో డిజిటల్ విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. డిజిటల్ తరగతులలో విద్యార్థులకు బొమ్మలతో కూడిన విద్యాబోధన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంతనూతపాటు టిడిపి ఇన్‌ఛార్జీ బిఎన్ విజయ్‌కుమార్, ఉపాధి హామి పథకం పిడి పోలప్ప, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జలసిరి జాయింట్ కమిషనర్ వరప్రసాదరావు, డిఇవో విజయభాస్కర్, ప్రధానోపాధ్యాయులు నూతక్కి నాగకళ్యాణి, రావి ఉమామహేశ్వరరావు, కాకర్ల విజయ్, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.