రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం : కోమటి జయరామ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని తానా అధ్యక్షుడు కోమటి జయరామ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగామ వచ్చిన ఆయన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయం కోసం ప్రచారం చేస్తున్న మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. ప్రపంచ దేశాలలో ఆయన పాలన పట్ల చర్చ సాగుతుందన్నారు. మేథస్సు, అంకిత భావం గల చంద్రబాబు ఒక్కరే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రతి తెలుగువారూ చంద్రబాబు విజయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన చొరవతోనే అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇతరులు గెలిస్తే ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కష్టమన్నారు.
అభివృద్ధి చెందుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి చంద్రబాబు వంటి దార్శినిక ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు. ఆయన విజయం కోసం మాతృభూమి అభివృద్ధి కోసం తనతో పాటు ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. నందిగామ నుంచి తంగిరాల సౌమ్యను, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు శీలంనేని గోపాలకృష్ణ, అనుమోలు రామకృష్ణ, వాసిరెడ్డి వంశీ, శీలంనేని సుధాకర్, డాక్టర్ బొందల పాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.