ప్రభుత్వ శాఖల సహకారం ప్రశంసనీయం: జయరాం కోమటి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నారైలు ఇచ్చిన విరాళాలతో జరుగుతున్న జన్మభూమి పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్రానికి వచ్చిన జయరాం కోమటిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలోని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ సెల్ ఏర్పాటుకు కమిషనర్ రామంజనేయులు ఇచ్చిన సహకారం మరువలేమని, ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ రెండు శాఖలు ఇచ్చిన సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు విజయ వంతంగా నిర్వహించగలమనే విశ్వాసం తనకు కలిగిందని చెప్పారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీస్ వేమన మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో రామాంజనేయులు ఇచ్చిన సహకారాన్ని తానా ఎప్పటికీ మర్చిపోదన్నారు. 5వేల ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2500 పాఠశాలల్లో ఏర్పాటు పూర్తిచేశామని అందుకు సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ 5వేల పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభించటం అంటే మాములు విషయం కాదన్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు ఇక్కడ వారి స్వగ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.