ASBL Koncept Ambience

మహాసభలకు 8వేల మంది ప్రతినిధులు

మహాసభలకు 8వేల మంది ప్రతినిధులు

ప్రపంచ తెలుగు మహాసభలను కనీవినీ ఎరుగని రీతిలో, తెలంగాణ భాష, జీవనసౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా నిర్వహించాలని ఉప  ముఖ్యమంత్రి, ప్రపంచ తెలుగు మహాసభల ఉపసంఘం చైర్మన్‌ కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఆయన పేర్కొన్నారు. మహాసభల్లో మొత్తం ఎనిమిదివేల మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇందులో 40 దేశాల నుంచి 160 మంది పాల్గొనబోతున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తెలుగుభాషాభిమానులు వస్తున్నందున, అతిథులందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై కడియం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆతిథ్యంలో తెలంగాణకు ఉన్న పేరు ప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలందరూ ఈ పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రపంచ తెలుగు మహాసభల సంబురాలు జరుగడం ఒక గొప్ప విశేషమని అన్నారు. ఈ సభల సందర్భంగా 8వేల మంది అతిథులు వస్తున్నారని, 40 దేశాల నుంచి 160 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని చెప్పారు.

ఇతర రాష్ట్రాల నుంచి 1167 మంది ప్రతినిధులు, తెలంగాణ నలుమూలల నుంచి ఆరువేలకు పైగా తెలుగు భాషాభిమానులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆహ్వానం అందుకోన్న ప్రముఖులకు మాత్రమే వసతిసదుపాయాలు, ప్రయాణ ఖర్చులు ఇస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే ప్రతినిధులక వసతి సదుపాయం కల్పించడం లేదని, అదేవిధంగా ఆన్‌డ్యూటీ హాజరయ్యే తెలుగు పండితులకు కూడా ప్రయాణ ఖర్చులు, వసతి కల్పించడం లేదని చెప్పారు. అయితే అన్ని వేదికలలో భోజన సదుపాయాలు ఉంటాయని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికల దగ్గర తెలంగాణ వంటకాలు, రచనలు , తెలంగాణ చరిత్రను తెలియచేసే పుస్తకాలు, చిత్రాలు, చేనేతలు, చేతివృత్తులు, కళాప్రదర్శనలు, తెలంగాణ ఆలయాలు, నాణేలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మహాసభలకు వచ్చే వారికి ఎక్కడెక్క ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాలతో ముందుగానే ఐదురోజుల కార్యక్రమాలతో ప్రచురించిన కరపత్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

Tags :