డాలస్ లో విజయవాడ కనక దుర్గ అమ్మవారి కుంకుమార్చనలు
అమెరికాలోని వివిధ నగరాల్లో జరుగుతున్న విజయవాడ కనకదుర్గ కుంకుమార్చనల పూజల్లో భాగంగా మే 22వ తేదీన టెక్సాస్‌లోని డాలస్ - ఫ్రిస్కోలో జరిగిన కుంకుమార్చన పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయవాడ నుంచి వచ్చిన ఆలయ బృందం భక్తుల చేత శాస్త్రోక్తంగా కుంకుమార్చనల పూజలు చేయించింది. త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పూజలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఫ్రిస్కోలోని ఎంబసీ సూట్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు భక్తులు తరలివచ్చి ఆదిపరాశక్తిని దర్శించుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన లింగంభొట్ల దుర్గాప్రసాద్, శంకర శాండిల్య, కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతోపాటు, పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు ఈ కుంకుమార్చనలను భక్తిపారవశ్యంగా జరిగేలా చేశారు. పూజల్లో పాల్గొన్న దంపతులకు అమ్మవారి కుంకుమ ప్రసాదంతోపాటు శేషవస్త్రాలను, డాలర్‌ను బహూకరించారు. ఈ పూజలకోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకువచ్చిన శ్రీచక్రార్చన పీఠం అందరినీ విశేషంగా ఆకర్షించింది. శేషారావు బొడ్డు, రవి మద్ది, సురేంద్ర ధూళిపాళ్ళ, లక్ష్మీ కాంభోజి, రవి కావూరి, సుబ్బారావు పొన్నూరు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. రామ్ తాతినేని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.