పోర్ట్ లాండ్ లో ఘనంగా జరిగిన అమ్మవారి పూజలు
పోర్ట్‌లాండ్‌లోని హిందూ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలోని పోర్ట్‌లాండ్ బాలాజీ టెంపుల్‌లో జరిగిన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చనలు వైభవంగా జరిగాయి. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పూజారులు శంకర శాండిల్య, లింగంభొట్ల దుర్గాప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతోపాటు, ఆలయ పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు ఈ పూజల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూశారు. భక్తుల చేత అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అమ్మవారి కుంకుమార్చనలతోపాటు, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పారాయణం వంటివి చేయించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్, శేషవస్త్రాలను బహూకరించారు. కాగా అమ్మవారి అలంకరణతోపాటు, వేదిక ముందు వేసిన శ్రీచక్రం అందరినీ ఆకట్టుకుంది. ఆలయ పూజారి రాజగోపాల్ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించడంతోపాటు వచ్చిన భక్తులకు తగిన సూచనలను కూడా ఇచ్చారు.