ఘనంగా శాక్రమెంటోలో విజయవాడ కనకదుర్గ పూజలు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 'తెలుగు టైమ్స్', 'పాఠశాల' నిర్వహిస్తున్న విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చనలు మే 15న శాక్రమెంటోలోని లక్ష్మీనారాయణ టెంపుల్‌లో ఘనంగా జరిగాయి. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పూజారులు శంకర శాండిల్య, లింగంభొట్ల దుర్గాప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతో పాటు విజయవాడ ఆలయ పిఆర్‌ఓ అచ్చుతరామయ్య, ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా చూశారు. భక్తుల చేత శాస్త్రోక్తంగా అమ్మవారి కుంకుమార్చనలతో పాటు, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పారాయణం వంటివి చేయించారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శ్రీ చక్ర పీఠం పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి పసుపు కుంకుమలతోపాటు అమ్మవారి కంకణం, డాలర్‌ను కూడా ఇచ్చారు. వెంకట్ మేచినేని, వెంకట్ బుక్కా ఈ పూజలను పర్యవేక్షించారు.