ASBL Koncept Ambience

కేసీఆర్ వ్యూహం...ఎవరికీ చిక్కదు!

కేసీఆర్ వ్యూహం...ఎవరికీ చిక్కదు!

తెలంగాణ తేవడంలోనూ, అధికారాన్ని తెచ్చుకోవడంలోనూ ఆయన రూటే వేరు. ఎప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాడో ఆయన పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలియదు. చివరకు ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీని రద్దు చేసి అందరినీ మాజీలు చేశారు. సాధారణంగా ఇలాంటి వ్యవహారంలో ఎంతో దూరదృష్టితో వ్యూహంతో ముందుకెళితేనే అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తన వ్యూహానికి పదును పెట్టి అవసరమైనవారిని కలిసి అన్నీ సరిగ్గా జరిగేలా చూశారు. ఢిల్లీలో ఆయన అధికారులు, ఎంపీలతో పెట్టించిన పరుగులు, ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన సంప్రదింపులు, తరువాత ఇచ్చిపుచ్చుకోవడంపై జరిగిన మాటలు ఏవీ సొంతమంత్రులకే తెలియదు. ఎమ్మెల్యేలకు అసలే తెలియదు. ఓవేళ చూచాయిగా తెలిసినా కేసీఆర్‌ పట్ల ఉన్న భయభక్తులు అధికంగా ఉన్న కారణంగా ఏమీ మాట్లాడలేదు. తాను అనుకున్నట్లుగానే కేసీఆర్‌ గురువారం ఉదయం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఏకవాక్య తీర్మానం పెట్టారు. మంత్రులంతా ఓకే అని తలూపడం, వెంటనే గవర్నర్‌ను కేసీఆర్‌ కలిసి మంత్రివర్గ తీర్మానాన్ని అందజేయడం, అప్పటికప్పుడే గవర్నర్‌ కూడా రద్దుకు ఆమోదముద్ర వేయడం, ఆయన అలా చేయడం, కొద్ది సమయాల్లోనే గెజిట్‌ రావడం అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. నిజానికి ఇలాంటి వ్యవహారాలన్నీ జరగడానికి రోజులైనా పడుతుంది.

కానీ అక్కడ ఉన్నది కేసీఆర్‌ కాబట్టి అన్నీ ఆయన అనుకున్నట్లు క్షణాల్లోనే జరిగిపోయాయి. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా తెలంగాణ ఎన్నికలపై కదలిక వచ్చిందంటే అది కేసీఆర్‌ సాధించిన విజయం. తాను అనుకున్నట్లు జరగడానికి కేసీఆర్‌ ఏమైనా చేస్తారు. దానికి తగినట్లుగా పావులు కదుపుతారు. స్నేహాన్ని పాటిస్తారు. ఇలాంటి కేసీఆర్‌ ఆలోచనలను, వ్యూహాలను పక్కనున్న మంత్రులే గమనించలేరు. ఇక విపక్షాలు ఏమి గమనిస్తాయి. విపక్షాలు వీక్‌గా ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారన్నది వాస్తవం. అధికారపక్ష ఎమ్మెల్యేల్లో కొన్నిచోట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ అందరికీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయన ఝలక్‌ ఇచ్చారనే చెప్పాలి.

అసెంబ్లి రద్దు గురించి ముందే ఊహించినా అసెంబ్లి అభ్యర్ధుల జాబితా గురించి మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంకురార్పణగా పదో పదిహేనో పేర్లతో తొలి జాబితా విడుదల కావచ్చన్న సంకేతాలు వచ్చాయి. అలాగే 70-80 మంది పేర్లు ప్రకటించొచ్చని మరో సందర్భంలో వినిపించింది. ఎన్నికలకు ఇంత ముందుగా అన్ని పేర్లు ప్రకటించడం ద్వారా తలనొప్పుల్ని కొనితెచ్చుకునే ప్రయత్నం కేసీఆర్‌ చేయరని తెరాస శ్రేణులే ఆలోచన చేశాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆయన ఏకంగా 105 సీట్లకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. పద్నాలుగు చోట్ల తప్ప మిగతా అన్నిచోట్లా సిట్టింగుల పేర్లే ప్రకటించారు. అందుకే ఇది కూడా సాహసోపేతమైన చర్య అయింది. సిట్టింగులకే ఇచ్చారు కాబట్టి ఇదేమంత పెద్ద కసరత్తు కాదనిపిస్తుంది గాని నిజానికి ఆయన కొద్ది వారాలుగా దీనిమీద లోతైన తీవ్రమైన కసరత్తే చేశారు.

దాదాపు పద్నాలుగు రకాల సర్వేలతో ఏ అభ్యర్ధికి ఆ అభ్యర్ధిని వడబోసి..వివిధ వర్గాల ద్వారా అభిప్రాయాలు సేకరించి..తనకున్న పరిచయాలతోను, అవగాహనతోను అభిప్రాయాలు సమీకరించుకుని ఇన్ని సీట్ల మీద తిరుగులేని స్పష్టతకు వచ్చినట్టు కనిపిస్తున్నది. మామూలుగా అయితే ఏ ఎన్నికలైనా.. ప్రతి పార్టీకీ అభ్యర్ధుల ఎంపిక కత్తిమీద సాములా ఉంటుంది. ఆ కసరత్తే పార్టీ గెలుపోటముల మీద ప్రభావం చూపుతుంది గనక వివిధ పార్టీలు ఈ ప్రక్రియ మీద వారాలకు వారాలు కసరత్తు చేస్తాయి. అభ్యర్ధుల విషయంలో ప్రతి ఒక్క సీటుకి మూడు నాలుగేసి పేర్లతో ప్రాధమిక జాబితాలు సిద్దం చేస్తారు. వడబోతల మీద వడబోతలు చేసి అంతిమంగా ఒక్కొక్క పేరుని ఖరారు చేస్తారు. అయినా కొన్ని సందర్భాల్లో చివరి క్షణాల్లో కూడా పేర్లు మారు తుంటాయి. ఇదొక రకంగా పార్టీలకు తలనొప్పి కలిగించే వ్యవహారమే. ఇంతటి కీలకమైన ప్రక్రియను కేసీఆర్‌ ప్రశాంతంగా.. ఇదేమీ పెద్ద విషయం కాదు అన్నట్లుగా చాలా సాదాసీదాగా ప్రకటించేశారు.

మొదటి నుంచీ కేసీఆర్‌ ఒక సంచలనంగానే రాష్ట్ర రాజకీయాల్లో నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచీ ఆయన తీసుకున్న వివిధ సంచలనాత్మక నిర్ణయాలు యావత్‌ దేశం దష్టిని ఆకర్షించాయి. ప్రజల సంక్షేమానికి ఇప్పటిదాకా ఆయన ప్రకటించిన పథకాలు కూడా ఆయన విస్త తస్ధాయి ఆలోచనావిధానానికి అద్దం పట్టాయి. ఏది చేసిన కనీస స్ధాయిలో చేయడం కాకుండా గరిష్టస్ధాయిలో చేయడమే తన విధానంగా మలుచుకున్న కేసీఆర్‌ పథకాల రూపకల్పనలో ఇంతవరకు ఏ ఇతర ముఖ్యమంత్రీ చేయని ఆలోచనలు ఆయన చేసినట్టు ఇప్పటికే నిరూపించుకున్నారు.

కేసీఆర్‌ వ్యూహం తలపండిన మేథావులకు కూడా అంతుచిక్కడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకు సానుకూలంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన అదుపాజ్ఞలకు లోబడి పనిచేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం కూడా ఆయన కనుసైగల పరిధిలోనే పరిభ్రమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ అసెంబ్లిని రద్దు చేశారు. తిరిగి ఎన్నికలకు సిద్దపడ్డారు. ఎందుకు ఇలా చేశారన్నదానిపై ఎన్నోరకాల కథనాలు వినవస్తున్నాయి.

జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే రద్దు

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు యుపిఎ కానీ, ఎన్‌డీఎ కాని పూర్తిగా మెజారిటీని సాధించేలా కనిపించడం లేదు. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఎంపీలను పెద్దఎత్తున గెలిపించుకుంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశాలు ఉంటాయని కేసీఆర్‌ భావించారు. దానికి తగిన వాతావరణం కావాలంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలను జరిపించేస్తే లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు తగినంత వ్యవధి ఉంటుందని ఆలోచించారు. రెండోది తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే తప్పకుండా ఎంపి ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని అనుకున్నారు. పరిస్థితులన్నీ తనకు ఇప్పుడు సానుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని అంటారు.

ఏదీ ఏమైనా కేసీఆర్‌ లాంటి రాజకీయ వ్యూహచతురునితో తలపడాలంటే విపక్షాలకు ఇప్పుడు ఉన్న బలం సరిపోదని తేలిపోతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేసీఆర్‌ను అధికారంలోకి రాకుండా నిలువరించలేరని కూడా తెలుస్తోంది.

- టీజీఆర్‌

 

Tags :