దుర్గా సప్తశతీ పారాయణంలో కేసీఆర్ దంపతులు
ఐదు రోజుల పాటు జరిగే అయుత చండీ యాగం మొదటి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా వివిధ కార్యక్రమాలు జరిగాయి. శృంగేరి పీఠం నుంచి వచ్చిన శాస్త్ర పండితులు నరహరి సుబ్రహ్మణ్యభట్, తంగిరాల శివకుమార శర్మ, పవిత్ర శ్రీ చక్రానికి నవార్ల పూజా కల్పోక్తంగా ప్రత్యేక అర్చనలు జరిపారు. మధ్నాహ్నం జరిగిన శ్రీ రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో ఆచార్య రవిశంకర్, వేద పండితులు కుప్పా రామజోగి సోమయాజులు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. ప్రసిద్ద సంస్కృత పండితులు ఆచార్య ఆయాచితం నటేశ్వరశర్మ, ''యజ్ఞాలు-సామాజిక ప్రయోజనాలు'' అనే అంశంపై ప్రసంగించారు. హంపి విరూపాక్ష పీఠం అధిపతి విద్యారణ్య విరూపక్ష స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠం అధిపతులు శ్రీ వీరవైశ మహాస్వామి పాల్గొని కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు.
సాయంత్రం పూట రుద్రక్రహర్చన, నీరాజ సేవ, శ్రీరామ లీల గేయ కథాగానము భక్త జనులను అలరించాయి. యాగాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో వేలాది మంది మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి దీక్షాదారులైన రుత్విజులు పవిత్రదీక్షా వస్త్రాలు ధరించి శ్రీ దుర్గా సప్తశతీ పారాయణం చేయడంతో పాటు ఇతర పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని అందరూ మొదటి రోజు కోసం నిర్దేశించిన పసుపు వర్ణం దీక్షా వస్త్రాలు ధరించారు. యాగం చూడడానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదంతో పాటు దైవ ప్రసాదం, పసుపు, కుంకుమ అందించారు.