అమరావతిలో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ ఏర్పాటు
బ్రిటన్‌లో అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తక్షణమే 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. కేసీహెచ్ భారతదేశంలో మొత్తం 11 ఆసుపత్రులను ఏర్పాటు చేయనుందని, అమరావతిలో ఆసుపత్రి వాటన్నింటికీ కేంద్ర కార్యాలయంగా ఉంటుందని తెలిపారు. భారతదేశంలో ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారన్నారు. ప్రపంచ స్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికే పరిమితం కాకుండా భారతదేశంలో ఆరోగ్య పర్యాటకానికి ఈ సంస్ధ దన్నుగా నిలస్తుందని తెలిపారు. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ బ్రిటన్లో అతిపెద్ద, అత్యంత రద్దీ కలిగిన బోధనాసుపత్రుల్లో ఒకటి. కాలేయ సంబంధ వ్యాధులు, కాలేయ మార్పిడి, నాడీవ్వవస్థ సంబంధ వ్యాధులు, రక్త క్యాన్సర్, పిండస్థ సమస్యల వైద్యంలో ఈ ఆసుపత్రి ప్రత్యేక కృషి చేస్తుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న 6387 ఏకరాల ఆరోగ్య నగరంలో కేసీహెచ్‌కు అవకాశం కల్పిస్తారు. ఆరోగ్య అకాడమీ, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేస్తారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), ఇండో -యూకే ఇన్‌స్టిట్యూట్ ఆప్ హెల్త్ సంస్థలు ఇప్పటికే ఇక్కడ ఆసుపత్రుల ఏరాపటుకు ఆసక్తి ప్రదర్శించాయని తెలిపారు.