కృష్ణా ఎన్నారై ఉగాది వేడుకలు
డాలస్‌లో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఎన్నారైలు దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఫార్మర్స్ బ్రాంచ్ సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది తెలుగువారు హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు పొన్నూరు సుబ్బారావు వచ్చిన అతిధులను ఘనంగా ఆహ్వానించి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పంచాంగ శ్రవణం తరువాత సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సేవా కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశ్యంతోనే కృష్ణా జిల్లా ఎన్నారై సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యాకృష్ణ పథకం ద్వారా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తుమ్మల లక్ష్మీ ప్రిస్కో సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. సుధీక్షణ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు చిగురుపాటి విమల, హీల్ సంస్థ ప్రతినిధి డాక్టర్ చుండూరు కృష్ణబాబులను ఘనంగా సన్మానించారు.