సమ్మిట్ విజయవంతానికి తెలంగాణ ప్రభుత్వ కమిటి ఏర్పాటు
దక్షిణాసియాలో మొదటిసారిగా భారత్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపికచేసిన నేపథ్యంలో సదస్సు విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు, ఇతర అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కేటీఆర్ నేతృత్వంలో 11 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రతిష్టాత్మకమైన సదస్సు కావడంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు హైదరాబాద్, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించే ఏర్పాట్లుచేస్తున్నారు. అతిథ్య రాష్ట్రంగా సదస్సులో తెలంగాణకు ప్రత్యేక అవకాశం ఇస్తారని సమాచారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా స్వయంగా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. దీనితో పాటుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను చూపించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సదస్సు సమయంలో నగరాన్ని సుందరంగా అలంకరించాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించినట్లు తెలిసింది.