ASBL Koncept Ambience

హైదరాబాద్‌లో 1750 కోట్లతో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుబడి

హైదరాబాద్‌లో 1750 కోట్లతో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుబడి

హైదరాబాద్ లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రెడీ అయింది. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, కల్పిస్తున్న మౌలిక వసతులు తమ విస్తరణ, ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని ఆ కంపెనీ తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్ లోని అడ్వెంట్ ఇంటర్నేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్ లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఈ మీటింగ్ లో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd), అవ్రా ల్యాబొరేటరీస్ (Avra Laboratories) లో మెజార్టీ వాటాలు కొనేందుకు 1750 కోట్ల రూపాయాలు పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ కంపెనీ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వాగతించారు.

“హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలన్న అడ్వెంట్ నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించింది. అడ్వెంట్ కంపెనీ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇతర లాభదాయక పెట్టుబడి అవకాశాలను కంపెనీ అన్వేషిస్తుందన్న నమ్మకం నాకుంది. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాము అని కేటీఆర్ అన్నారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

2003 లో ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd) కంపెనీ హైదరాబాద్ లో స్థాపించబడింది. బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్ లిమిటెడ్ నుంచి మెజార్టీ వాటాలను అడ్వెంట్ కొనుగోలు చేసింది. ఫార్మాసూటికల్ రంగంలో ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ (RA Chem Pharma Ltd) కంపెనీ ప్రధాన ఉత్పత్తిదారు. ఔషధాల్లో ప్రభావవంతమైనవిగా చెప్పుకునే పెల్లెట్స్ తయారీతో పాటు B2B ఫార్ములేషన్స్ , క్లినికల్ స్టడీస్ పై కెమ్ ఫార్మా పనిచేస్తోంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మరో ఫార్మా కంపెనీ అవ్రా ల్యాబ్ లో కూడా మెజార్టీ వాటాలను అడ్వెంట్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 1750 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. ఈ రెండు కంపెనీలకు 6 తయారీ యూనిట్లు, 3 పరిశోధన (R&D )యూనిట్లు ఉన్నాయి. 2500 మంది ఉద్యోగులు ఈ రెండు కంపెనీల్లో పనిచేస్తున్నారు.

1984లో స్థాపించబడిన అడ్వెంట్ కంపెనీ ప్రముఖ ప్రైవేట్ పెట్టుబడి సంస్థ. 42 దేశాల్లోని ఆరోగ్య, ఆర్థిక, రిటైల్, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో సుమారు 4 లక్షల 60వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టింది.

 

Tags :