జూరిచ్ తో ఎపి సిస్టర్ స్టేట్ ఒప్పందం
దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సమక్షంలో జూరిచ్, ఆంధ్రప్రదేశ్ అధికారులు సిస్టర్ స్టేట్ ఒప్పంద పత్రాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల పర్యావరణ సాంకేతికత, జీవశాస్త్రాలు, పట్టణ, ప్రాంతీయాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. కాగా జూరిచ్ టెక్నాలజీ వినియోగంలో, వినూత్న ఆవిష్కారాలలో ఆదర్శంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఇదే బాటలో పయనిస్తున్న సత్సమయంలో జూరిచ్, ఏపీ ప్రభుత్వాల మధ్య సిస్టర్ స్టేట్ ఒప్పందం జరగడం సంతోషమని చంద్రబాబు అన్నారు.
సిస్టర్ స్టేట్ ఒప్పందానికి ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జ్యూరిచ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రి కార్మెన్ వాకెర్ స్పా, ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి బ్యూన్ సాటర్, జ్యూరిక్ ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజర్ కొరిన్ వ్యేర్ భేటీ అయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాలలో జ్యూరిచ్ ఎంతో పటిష్టంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి కార్మెన్ వాకెర్ ముఖ్యమంత్రికి వివరించారు. విద్యారంగానికి తాము జ్యూరిక్లో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు కార్మెన్ చెప్పారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలకు ప్రాధాన్యాన్ని ఇస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి బందంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, వ్యవసాయ సలహాదారు టి. విజయకుమార్ ఉన్నారు.