ASBL Koncept Ambience

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేదెవరు?

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేదెవరు?

లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవ డానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇతర పార్టీలను ఎన్‌డిఎలోకి ఆహ్వానిస్తూ, మరోవైపు వారితో సీట్ల సర్దుబాటును చేసుకుంటున్నారు. ప్రతిపక్ష యుపిఎ సారధ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. బిజెపి వ్యతిరేక కూటమిని బలంగా కూడగట్టేందుకు శ్రమిస్తోంది.

ఐదేళ్ల సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన మోదీ ఇంకోసారి గద్దెనెక్కాలంటే ప్రత్యర్థి పార్టీలు కూటమి కట్టకుండా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే  గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కొంచెం అటుఇటుగా చూస్తే 31 శాతం మాత్రమే. కాంగ్రెస్‌తోపాటు అనేక ప్రాంతీయ పార్టీలు సొంతబలంతోనే పోటీ చేశాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చెల్లా చెదురయ్యాయి. ఇది అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఎక్కడికక్కడ పొత్తులతో మోదీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇదే బిజెపికి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది.

యూపీలో  బీఎస్పీ, ఎస్పీలు జట్టు కట్టినా... పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌తో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుండటం, తమిళనాడులో యూపీఏ భాగస్వామి డీఎంకే, కర్ణాటకలో జేడీ(ఎస్‌)తో దోస్తీలు బిజెపికి అధికారం లేకుండా చేయడం కోసమే అన్నది సుస్పష్టం. అయితే బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు అంతగా విజయవంతం కాలేదు. ఫలితంగా ఈ పొత్తుల వల్ల కాంగ్రెస్‌కు లాభించేది తక్కువే. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు మజ్లిస్‌తోపాటు మరికొన్ని పార్టీలు తోడైతే పరిస్థితి జటిలంగా మారుతుంది.

గత ఎన్నికల్లో దేశం మొత్తం మోదీ హవాపై నడిచిపోతే.. ఈసారి మాత్రం పరిస్థితుల్లో కొంత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగానూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, సర్వేలలో వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే అటు ఎన్‌డిఎకు, ఇటు యుపిఎకు మెజారిటీకి కావాల్సినంత సీట్లు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలను కూడా తమ కూటమిలోకి తీసుకోవాలని అటు ఎన్‌డిఎ, ఇటు యుపిఎ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పాలకపక్ష బీజేపీ పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో పొత్తులను ఖరారు చేసుకొని ప్రచారంలోనూ శరవేగంగా దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ ఇంకా పొత్తుల చర్చల్లో తలమునకలై ఉంది. ఇప్పటి వరకు ఖరారైన కూటముల పొత్తులను, గతంలో వాటి బలాబలాలను బేరీజువేస్తే.....

మహారాష్ట్రకు సంబంధించి...

మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. శివసేనతో కలిసి మళ్లీ పొత్తు పెట్టుకున్నట్లు ఫిబ్రవరి 18వ తేదీన బీజేపీ ప్రకటించింది. ఇక్కడ శివసేనకు 23 సీట్లను బీజేపీ కేటాయించింది. 2014లో ఇచ్చిన వాటికన్నా ఐదు సీట్లు ఎక్కువ. గతేడాది నుంచి శివసేన ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రావడం వల్లనే ఇక్కడ ఆ పార్టీకి బిజెపి ఎక్కువ సీట్లు ఇచ్చిందని అనుకోవచ్చు. బీజేపీ-శివసేన కూటమికన్నా ముందే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ తన పొత్తుల గురించి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ వాటి మధ్య సీట్ల పంపకాలు ఖరారు కాలేదు. ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ ఇండియా మజ్లీస్‌ -ఏ ఇత్తెహాద్‌ - ఉల్‌ - ముస్లీమీన్‌తో పొత్తు పెట్టుకున్న ప్రకాష్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వాంఛిత్‌ బహుజన్‌ అఘాది కూటమితో ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకాల విషయంలోనే విభేదాలు ఉన్నాయి. ఈ కూటములు విడి విడిగా పోటీ చేసినట్లయితే బీజేపీ కూటమి వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీకి 23 సీట్లు, శివసేనకు 18 సీట్లు వచ్చాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు, కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. రాజు శెట్టి నాయకత్వంలోని స్వాభిమాని పక్ష పార్టీకి ఒక్క సీటు వచ్చింది.

బీహార్‌లో ఎలా ఉందంటే...

బీహార్‌లో బీజేపీ, జనతాదళ్‌ (యూ), లోక్‌జనశక్తి పార్టీలు ఓ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ, హిందుస్థానీ హవామీ మోర్చా, వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ, వామపక్షాలు కలిసి ఇక్కడ మహా కూటమిగా పోటీ చేస్తున్నాయి.

కర్ణాటక ఎటువైపు...

కాంగ్రెస్‌, జనతాదళ్‌-సెక్యులర్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తామని ఎప్పుడో ప్రకటించాయి. అయితే ఇప్పటికీ సీట్ల పంపకాలు జరగలేదు. రాష్ట్రంలోని 28 సీట్లకుగాను ఈ రెండు పార్టీలు 2014 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయగా కాంగ్రెస్‌ పార్టీకి 9, జనతాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. బీజేపీకి 17 సీట్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా బలం లేదు. అందుకే ఈ రెండు రాష్ట్రాలు జాతీయ పార్టీల పార్లమెంట్‌ ఫలితాలను ప్రభావితం చేయలేవు. తెలంగాణలో పాలకపక్ష టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటీ పడుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,  ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే పార్లమెంట్‌ సీట్లతో ఈ ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వ విషయంలో కీలకపాత్రను పోషిస్తాయని అనుకుంటున్నారు.

ఢిల్లీలో కుదరని పొత్తు

ఢిల్లీలోని ఏడు సీట్లకుగాను ఏడు సీట్లను 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పొత్తు కుదుర్చుకున్నట్లయితే ఇరు పార్టీలు కలిసి ఐదు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొత్తు కుదరకపోతే వాటి విజయం మూడు సీట్లకు పరిమితం అవుతుందన్నది చెబుతున్నారు.

 

Tags :