ASBL Koncept Ambience

ఘనంగా జరిగిన యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

ఘనంగా జరిగిన యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రి పునర్నిర్మాణ ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొ న్నారు. వేడుకల్లో భాగంగా తొలుత బాలాలయం నుంచి స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, అళ్వారులు, అండాళ్‌ అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, కేసీఆర్‌ మనవడు హిమాన్షు, దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త బి.నర్సింహ మూర్తి, ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి ఆచార్యులు విమాన గోపురాల వద్దకు చేరుకున్నారు. తొలుత గర్భాల యంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్‌కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు.

ప్రధానాచార్యులు నల్లంథీఘల్‌ లక్ష్మీ నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. ఇదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు. సీఎం పిలుపు మేరకు యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో అందరినీ ప్రధానాలయ ముఖ మండపంలో కూర్చో బెట్టారు. అంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. అర్చకులతో కలిసి భజనలు చేస్తూ నారసింహ జపం చేశారు. గర్భాలయంలో సీఎం కుటుంబ సభ్యుల అనంతరం అంతా దర్శనాలు చేసుకున్నారు.

మొత్తంగా పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానా ర్చకులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన క్రతువును పూర్తి చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న దేవస్థానం అభివృద్ధి మండలి వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహమూర్తి, ఆర్కిటెక్టులు ఆనంద సాయి, మధుసూదన్‌, స్థపతులు సుందర రాజన్‌, ఆనందాచారి వేలు తదితరులను సీఎం, మంత్రులు సన్మానించారు.

ముగిసిన పంచకుండాత్మక యాగం

పంచనారసింహుడు కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 7 రోజులు కొనసాగిన సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఆచార్యులు 8వ రోజున ముగింపు పలికారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో శాంతి కల్యాణం జరిపించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

Tags :