నా కల నెరవేరింది : మహారాష్ట్ర గవర్నర్
ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ గడ్డపై జరగాలని తాను గతంలో కలగన్నానని, ఇప్పుడు ఆ కల నేరవేరిందని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రపంచ మహాసభల గురించి తనకు చెప్పినప్పుడు తన కల నెరవేరుతోందని ఆనందపడ్డానని, కానీ ఇంత ఆడంబరంగా, ఘనంగా జరుగుతాయని ఊహించలేదని అన్నారు. తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వేల సంఖ్యలో రావడం సంతోషంగా ఉందన్నారు. అత్యధికంగా తెలుగు మాట్లాడే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారన్నారు. సీఎం కేసీఆర్ తనకు లేఖ రాసి హాజరు కావాలని కోరడంతోనే సంతోషపడ్డానని అన్నారు. నా తెలంగాణ కోటీ రతనాల వీణ అని దాశరథి నినదించినా ఇప్పుడు కోట్లాది రతనాల వీణలు ఈ మహాసభలను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కార్యక్రమాలు తలపెట్టినా తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటారని అన్నారు. తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా, కవిత్వం పైనా ఆసక్తి మాత్రమే కాక అభినివేశం ఉన్న కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా తీర్చిదిద్దారన్నారు. సినారె ఈ నల్లని రాళ్లలో అనీ, దాశరథి ఈ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాశారని, అయితే కానరాని భాస్కరులందరినీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఈ మహాసభల ద్వారా వెలుగులోకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. కానరాని భాస్కరులందరూ హైదరాబాద్‌ను కబ్జా చేశారన్నంత సంతోషంగా ఉందన్నారు.