కేసీఆర్‌ను ప్రశంసించిన మలేషియా ఎన్నారైలు
తెలుగు మహాసభలు న భూతో తెలుగుకు మంచి రోజులొచ్చాయ్ అంటూ, ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరైన మలేషియా బృందం ప్రశంసించింది. సభల ఏర్పాట్లు, సీఎం ప్రసంగానికి ఫిదా అయ్యామని వారు చెప్పారు.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
తెలుగు వైభవానికి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయులు కృషి చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆ బాధ్యత ఎత్తుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురుకు పాదాభివందనం చేఇ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సంస్కారాన్ని ప్రపంచానికి చాటారు. సభల తొలిరోజు ఆయన చేసిన ప్రసంగం అద్భుతం. తెలుగు భాషా ప్రేమికులందరికీ ఒక పెద్దన్న లాగా నిలిచారు.
- దత్తు డాక్టర్ అచ్చయ్య కుమర్ రావు, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు
మలేషియాలో తెలుగు నేర్పుతున్నాం
నేను ఇప్పటివరకు ఐదు తెలుగు సభలకు హాజరయ్యా. ఇది అద్భుతం. ఇంత ఘనంగా, అందరినీ సంతృప్తి పరిచేలా ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్ స్వయంగా తెలుగు భాషాప్రియులు కాబట్టి ఇంత గొప్పగా సభలు నిర్వహించారు. మలేషియాలోని మన వారికి మన భాష నేర్పించాలనే ఉద్దేశంతో అక్కడ తెలుగు అకాడమీ ప్రారంభించా.
- రాములు సిమంచలం, ప్రధాన ఉపాధ్యక్షుడు
తెలంగాణ వంటలు అదరహో
ఇన్ని రకాల తెలుగు వంటలు రుచి చూడటం ఇదే తొలిసారి. వంటలు అద్భుతం. ఇక్కడి వారి ప్రేమాప్యాయతలు మరిచిపోలేను. అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్న తీరు ఆమోఘం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు కోర్సులో తెలుగు నేర్చుకుంటున్నాను. నగరాన్ని విడిచి వెళ్లాలనిపించడం లేేదు.
- దయా శ్రీ రేఖ, మలేషియా ప్రతినిధి
ఉద్యోగం కావాలంటే మలయ్ తప్పనిసరి
మలేషియాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే స్థానిక భాషైన మలయ్ కచ్చితంగా మాట్లాడాలి. రాయాలి. మేము తెలుగు పండుగలు ఘనంగా నిర్వహించుకుంటాం. మలేషియాలో ఐదు లక్షల మంది తెలుగువారు ఉన్నారు. అక్కడి వారికి తెలుగు నేర్పించాలనే ఉద్దేశంతో మలేషియా తెలుగు అకాడమీ ప్రారంభించాం. వచ్చే ఏడాది 350 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం.
- వెంకట రామానాయుడు, సంఘం సభ్యుడు
సభ ఏర్పాట్లు అద్భుతం
మాకు ఇంత గొప్పగా ఆతిథ్యం లభిస్తుందనుకోలేదు. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి మమ్మల్ని గౌవరంగా చూసుకుంటున్నారు. పిల్లలతో సహా మొత్తం వంద మందిమి తెలుగు సభల కోసం వచ్చాం. భోజనాలు చాలా బాగున్నాయి. ఇక్కడి పోలీసలు స్నేహపూర్వకంగా ఉన్నారు. మన మాతృభాష పండుగల జరుగుతుంటే తప్పనిసరిగా హజరవుతాం.
- డాక్టర్ వెంకటప్రతాప్, మలేషియా ప్రతినిధి
తొలిసారి హైదరాబాద్ వచ్చాం
నేను తొలిసారి హైదరాబాద్ వచ్చాను. మలేషియాలో ఉన్న తెలుగువారందరూ మన భాషను ప్రేమిస్తారు. ప్రతి గురువారం పిల్లలను తెలుగు తరగతులకు పంపిస్తాం. దాదాపు ఎవరూ మమ్మీ, డాడీ అని పిలువరు. అమ్మా, నాన్న అనే పిలుస్తారు. మలేషియాలో పుట్టి పెరిగిన నాలుగో తరానికి చెందిన వాళ్లం మేము. తెలుగు భాషను మా పిల్లలకు అందిస్తాం.
- గౌరి, మలేషియా ప్రతినిధి