ఢిల్లీపీఠంపై కన్నేసిన మమత
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీపీఠం అధిరోహించేలా పావులను కదుపుతున్నారు. తాను అనుకున్నది సాధించేంతవరకు విశ్రమించని నేతగా ఆమెకు పేరు ఉంది. పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాలుగా అధికార పీఠంలో ఉన్న వామపక్ష పార్టీని ఆమె గద్దె దింపారు. లెఫ్ట్ కోటను కూల్చడమే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే తన గుప్పెట పట్టి కేంద్రాన్ని శాసించగలికే స్థాయికి ఆమె చేరుకోగలిగారు. కేంద్రంలో యుపీఏ ఉన్నా, నేడు ఎన్‌డీఏ అధికారంలో కొనసాగుతున్నా మమతను వీడి ఎవరూ మనుగడ సాగించలేని పరిస్థితిని ఆమె సృష్టించగలిగారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్‌డీఏకేకు కేంద్రంలో పూర్తి బలం వచ్చినా బెంగాల్ అధినేత్రి అంటే ఢిలీల్లో గుబులే. నిన్న చరిత్ర తిరగరాసిన ఆమె ఇప్పుడు మళ్లీ హస్తిన కేంద్రంగా తన రాజకీయ జీవితాన్ని మలుచుకోవాలని భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్ పాత్ర మమతే అవుతుందన్నడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోదీ విధానాలను అనునిత్యం తూర్పారపడుతూ విపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారిన మమతా బెనర్జీ పాత్ర లోక్‌సభ ఎన్నికల తరువాత మరింత కీలకమవుతుందనడంలో సందేహం లేదు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువరించేందుకు ముందే 23 ప్రతిపక్ష పార్టీలతో కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించి తన సత్తాచాటుకుందామె. లోక్‌సభ ఎన్నికలయ్యాక కేంద్రంలోనూ మమతా బెనర్జీ నాయకత్వంలోని తణమూల్ కాంగ్రెస్ చక్రం తిప్పుతుందని భావిస్తున్నారు.
64ఏళ్ల మమతా బెనర్జీ అనేక సమరశీల పోరాటాలకు కేరాఫ్ అడ్రసుగా మారారు. 2007-08 నందిగ్రామ్, సింగూర్ పోరాటాల్లో ఆమె మరింత రాటుతేలారు. 1970లో యువజన కాంగ్రెస్‌లో అరంగేట్రం చేసిన ఆమె అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. వామపక్ష ప్రభుత్వంపై అపరకాళీలా విరచుకుపడేవారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ యూపీఏ, ఎన్‌డీఏలో మంత్రి పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత 1998 జనవరిలో తణమూల్ కాంగ్రెస్ పార్టీని మమత ఏర్పాటు చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికలు ఆమె రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పాయి. తణమూల్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది. 34 ఏళ్ల వామపక్ష కూటమి ప్రభుత్వం పతనం అయింది.
టీఎంసీకి 184 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి కమ్యూనిస్టులు ప్రభావం తగ్గుతూ వచ్చింది. వీధి పోరాటలు చేస్తూ రాజకీయాల్లో రాటుదేలిన మమత 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఏకంగా 211 అసెంబ్లీ స్థానాల్లో తణమూల్ కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిస్టులు కేవలం 31 సీట్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ప్రస్తుతం లోక్‌సభలో తణమూల్ కాంగ్రెస్‌కు 34 మంది ఎంపీలున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బిజెపికి తగిన మెజారిటీ రాకపోతే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వ విషయంలో మమతాది కీలకపాత్ర అవుతుందని రాజకీయ పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు.