తానా ఎన్నికలపై కోర్టు ఉత్తర్వులు... పాతబోర్డ్ ఆధ్వర్యంలోనే ఎన్నికల నిర్వహణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023-25 సంవత్సరానికిగాను నిర్వహించాల్సిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ ఎన్నికలను, ఇతర పదవులకు నిర్వహించే ఎన్నికలను వచ్చే మూడు నెలల్లోగా నిర్వహించాల్సిందిగా మేరీలాండ్ కోర్ట్ టీఆర్‌ఓ (Temporary Restraining Order) జారీ చేసింది. 2023 ఏప్రిల్ 30 నాటికి ఉన్న బోర్డు సభ్యులు ఈ ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. 90రోజుల్లో ఎన్నికలు జరిపి తదుపరి కార్యవర్గ సభ్యులను నియమించుకోవాలని మేరీల్యాండ్ కోర్టు తీర్పునిచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు తానాలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు ఇతర పదవులకు మరో 90 రోజుల్లో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. పాత బోర్డ్ మళ్ళీ సమావేశమై ఇప్పుడు తానా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తానా మహాసభలు, కోర్ట్ తీర్పుల ఆలస్యంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో తానా పెద్దలు సమావేశమై చర్చించి అప్పుడు ఎన్నికల్లో పోటీకి దిగిన 3 గ్రూపులతో సమావేశమై రాజీ చేసి పదవులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుట్లో తానాలో సంక్షోభం రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పెద్దలు ఈ మేరకు ఒప్పందాలను చేయించి ఇసి, బోర్డ్ సభ్యులను ఎంపిక చేశారు. ఈ మధ్యలో ఏమి జరిగిందో ఏమో ఓ వర్గం దీనిపై కోర్టును ఆశ్రయించి అస్సలు తానాలో ఎన్నికలు జరపకుండా నియామకాలు చేపట్టడాన్ని సవాల్ చేసింది. దీంతో మేరీలాండ్ కోర్టు తానా బైలాస్ ను పరిశీలించి ఇలాంటి నియామకాలు చెల్లవంటూ వెంటనే 90 రోజుల్లోగా ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని నియమించుకోవాల్సిందిగా కోరింది.
ఈ నేపథ్యంలో తానా పెద్దలు, గ్రూపు నాయకులు ఈ విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఒక పక్కన న్యాయ వ్యవస్థ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సిన పరిస్థితి, మరోవైపు గత ఎన్నికల సమయంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువవడంతో తానా ఓటర్లు పెద్దగా ఎన్నికలపై ఆసక్తిని చూపించకపోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ ప్రకంపనాలు తానా ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న భయం కొందరిలో ఉంది. దీనివల్ల తానా ఓటర్లు పెద్దగా ఈ ఎన్నికలను పట్టించుకోకపోవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు సాఫీగా జరిగేలా పెద్దలు, మాజీ అధ్యక్షులంతా కలిసి కూర్చుని చర్చించి నిర్వహిస్తే బావుంటుందని పలువురు సూచిస్తున్నారు.
తెలుగు టైమ్స్ పాఠకుల కోసం ఈ జడ్జిమెంట్‌ను ఈ క్రింద ఇస్తున్నాము.
Click here for Temporary Restraining Order