ఏపీకి పెట్టుబడుల రాకలో మెకన్సీ గ్లోబల్దే ముఖ్య భూమిక
ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్ధిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో ‘మెకెన్సీ గ్లోబల్’ ముఖ్యభూమిక పోషించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభిలషించారు. ఇందుకోసం సంస్థలోని ప్రతిభావంతులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కోరారు. దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో బుధవారం తనతో భేటీ అయిన ‘మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్’ సంచాలకుడు జోనాథన్ ఓజల్ (Jonathan Woetzel)తో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో పునాదులనుంచి నిర్మాణం అనివార్యమైందని, తమ ఈ కృషిలో ’మెకెన్సీ గ్లోబల్’ క్రియాశీలకపాత్ర పోషించాలని కోరారు.
జోనాథన్ వోజల్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్తు అంతా భారత్, చైనా దేశాలదేనన్నారు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25% ఈ రెండు దేశాల నుంచే వస్తుందని, సాంకేతికత కూడా ఈ ఉభయదేశాలదే ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
రానున్న మూడు మాసాలలో చైనా నుంచి 20 ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తేవటంలో, పెట్టుబడి దారులు రావటంలో తాము తోడ్పడతామని జోనాథన్ వోజల్ వివరించారు.