ఎన్నారైల చేయూత ఎపికి అవసరం- జయరామ్ కోమటి
నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులకోసం, జన్మభూమి అభివృద్ధికోసం అమెరికా నలుమూలలా పర్యటించి ఎన్నారైలను కార్యోన్ముఖులను చేసేందుకు ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జయరామ్ కోమటి కార్యాచరణతో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అట్లాంటాలో ఏప్రిల్ 2వ తేదీన జరిగిన సమావేశంలో జయరామ్ కోమటి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడాలంటే ఎన్నారైల సహకారం అవసరమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిపనుల్లో మనమంతా పాలుపంచుకుంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. జన్మభూమిపై మమకారంతో మనమంతా మనకు ఇష్టమైన ఊరిబాగుకోసం ముందుకు వస్తే అభివృద్ధి జరిగి రాష్ట్రం ముందుకెళుతుందన్నారు. మన ఊరి బాగుకోసం, రాష్ట్ర అభివృద్ధికోసం ఎన్నారైలంతా ముందుకురావాలని జయరామ్ కోమటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలోని తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు పాల్గొన్నారు. తానా నాయకుడు మధుతాతా, సురేష్ కె వోలమ్, శ్యామ్ మల్లవరపు, సునీల్ సవిలి, సాయిరామ్ పాములపాటి, నగేశ్ దొడ్డాక, వెంకి గద్దె, వెంకట్ మీసాల తదితరులు పాల్గొన్నారు.