ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా ట్రంప్
పాఠశాల విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యాపీనెస్ తరగతుల నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందానని అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యధినేత డొనాల్డ్ ట్రంప్ దంపతుల భారత పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మెలానియా దక్షిణ మోతీబాగ్‍లోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్‍ను సందర్శించారు. ఇక్కడ హ్యాపీనెస్ తరగతులకు హాజరై వాటి నిర్వహణను పరిశీలించారు. కాసేపు చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మెలానియా ప్రసంగించారు.
ఈ అందమైన స్కల్లో మీ అందర్నీ కలవడం చాలా సంతోషంగా ఉంది. సంప్రదాయ పద్దతిలో స్వాగతించినందుకు కృతజ్ఞతలు. నేను భారత్‍కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను. భారత పర్యటన పట్ల అధ్యక్షుడు ట్రంప్, నేను ఎంతో ఆనందిస్తున్నాం. ఢిల్లీ పాఠశాలల్లో హ్యపీనెస్ తరగతులు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రకృతితో మమేకమై విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం చాలా బాగుంది. విద్యార్థులకు నైపుణ్యాలను తెలియజేస్తూ నేటి సమాజానికి ఉదాహరణగా నిలుస్తున్న బోధకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని మెలానియా అన్నారు.
అమెరికాలో తాను కూడా చిన్నారులతో కలిసి బీ బెస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని మెలానియా తెలిపారు. మాదకద్రవ్యాల కారణంగా ఎదురయ్యే ప్రమాదాలు, ఆన్‍లైన్ భద్రత, చిన్నారుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రథమ మహిళకు విద్యార్థులు ప్రత్యేకమైన కానుకలు అందజేశారు. చిన్నారులు స్వయంగా గీసిన మధుబనీ పెయింటింగ్స్ను మెలానియాకు బహూకరించారు. అనంతరం విద్యార్థులకు మెలానియా షేక్‍హ్యాండ్ ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్కూల్ నుంచి వెళ్లిపోయారు.