ఘనంగా ఎంజీఎంఎన్ టీ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పేద, ధనిక, చిన్న, పెద్ద తేడా అనేదే లేకుండా దేశ పౌరులందరూ భార రాజ్యాంగాన్ని గౌరవించాలని ఎంజీఎంఎన్‌టీ చైర్మన్ ప్రసాద్ తోటకూర అన్నారు. బీఆర్ అంబేడ్కర్ వంటి ఎందరో మేథావుల శ్రమతో స్వాతంత్య్రం వచ్చిన రెండున్నరేళ్లకు 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నామని ఆయన తెలిపారు. టెక్సాస్‌లోని ఇర్వింగ్ సిటీలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎంజీఎంఎన్‌టీ డోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జాన్ హమ్మాండ్ గాంధీజి విగ్రహానికి పూలమాల వేయగా, జాతీయ జెండాను ప్రసాద్ తోటకూర ఆవిష్కరించి సభికులనుద్దేశించి ప్రసంగించారు. మహాత్మాగాంధీ పోరాట ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిందనీ, ఆ తర్వాత రెండున్నరేళ్లకు రాజ్యాంగాన్ని అములోకి తెచ్చుకున్నామన్నారు.
ఈ గణతంత్ర వేడుకలకు వందల సంఖ్యలో ఎన్నారైలు, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. ఇర్వింగ్ సిటీలో గాంధీ విగ్రహ స్థాపనకు కృషి చేసిన ఎన్నారై దాతలకు, నగర ప్రముఖులకు ఎంజీఎంఎన్‌టీ సెక్రటరీ రావు కాల్వల కృతజ్ఞతలు తెలిపారు. గణతంత్ర వేడుకలకు హాజరైన వారికి హృదయ పూర్వక స్వాగతం పలికారు. అంతేకాక ఎంజీఎంఎన్‌టీ ఆధ్వర్యంలో జనవరి 30న జరగబోయే గాంధీ 69వ వర్థంతి కార్య్కక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంఎన్‌టీ సభ్యులు తైయాబ్ కుందావాలా, షభనం మోడ్గిల్, జాక్ గౌడ్వాని, కుంటేష్ చోక్షి, జాన్ హమ్మాండ్, కమల్ కౌషల్, సూరి తాయగరజన్, బెనజీర్ అర్ఫీ పాల్గొన్నారు.