హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ మరో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు
కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్ ల ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది.
క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.