ఎపి అభివృద్ధి కోసం పలువురితో సమావేశమవుతున్న గంటా, జయరామ్
అమెరికా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధి విషయమై పలువురితో సమావేశమవుతున్నారు. రాష్ట్రంలోని అన్నీ ఉన్నత పాఠశాలలో డీజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు అవసరమైన నిధుల విషయమై కూడా ఆయన చర్చించారు. ఒక డిజిటల్ తరగతి గది నిర్మాణానికి లక్షా యాభైవేల రూపాయలు ఖర్చవుతుందని, అందులో ఎన్నారైలు 30శాతం విరాళంగా ఇస్తే మిగిలిన 70శాతాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. విరాళమిచ్చిన ఎన్నారైలు తాము కోరుకున్న పాఠశాలల్లో డీజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి కూడా గంటా శ్రీనివాసరావుతోపాటు ఎన్నారైలను కలుసుకుని మాట్లాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, అభివృద్ధికి అవసరమైన చేయూతను అందించాల్సిన అవశ్యకతను అందరికీ ఆయన వివరిస్తున్నారు. ఈ పర్యటనలో గుంటూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మరక్షక్ తదితరులు కూడా పాల్గొంటున్నారు.