విద్యాభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం ఎంతో అవసరం - గంటా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యాభివృద్ధికోసం ఎంతగానో కృషి చేస్తున్నారని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్, విద్యాహబ్‌గా మార్చేందుకు అవసరమైన అన్నీ చర్యలను ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. ఉన్నతమైన, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను మన విద్యార్థులు కూడా అందుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు అనేక విద్యాపథకాలను ప్రవేశపెట్టారన్నారు. కొలంబస్ ఒహాయోలోని మానస్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఇంటరాక్టీవ్ సెషన్ విత్ ఎపి గవర్నమెంట్ టీమ్‌తో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో సభ్యులు, నాయకులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో ప్రైమరీకి, హయ్యర్ ఎడ్యుకేషన్‌కు, టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖలు ఉండేదని, వీటన్నింటిని ఒకే గూటికి తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో మానవ వనరుల మంత్రిత్వశాఖను చంద్రబాబు ఏర్పాటు చేశారని, దానిని తనకు అప్పగించారని చెప్పారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికోసం 15వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోందని అన్నారు. ప్రభుత్వ బడ్జెట్‌లో దాదాపు 15శాతాన్ని ప్రభుత్వం విద్యకు కేటాయించిందని, కాంగ్రెస్ హయాంలో ఇది 10శాతం మాత్రమే ఉండేదని చెప్పారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, మరోవైపు ప్రభుత్వ స్కూళ్ళలో ఉత్తీర్ణతా శాతాన్ని కూడా పెంచేందుకు అన్నీ చర్యలు చేపట్టిందని తెలిపారు. 10వ తరగతిలో టాపర్స్‌కు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళలో 6శాతం మాత్రమే ఉండటం చూసి దీనిని ఎలాగైనే పెంచాలన్న ఉద్దేశ్యంతో తన మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి చర్చించి కొన్ని మార్పులను చేయాలనుకున్నామని చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా ఉందని గంటా వివరించారు.
ఎన్నారైలు తమ నాలెడ్జ్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తోడ్పడే విధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో డిజిటల్ తరగతుల ఏర్పాటులో ఎన్నారైల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా అందులో ఇతరుల భాగస్వామ్యం ఉంటే సరిగా విద్యాభివృద్ధి జరుగుతుందన్న ఆశతో మీ భాగస్వామ్యాన్ని ఆశిస్తోందన్నారు.
అంతకుముందు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీమతి కె. సంధ్యారాణి ప్రభుత్వ స్కూళ్ళలో ఉత్తీర్ణతాశాతాన్ని పెంచేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్రంలో విద్యారంగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత ఆమె మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్‌కు, ప్రభుత్వ స్కూళ్ళకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆమె వివరించారు.
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నారైలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడంతోపాటు, మూడు మంత్రిత్వస్థాయి ర్యాంక్‌లతో కూడిన బాధ్యతలను అప్పగించారని చెప్పారు. కూచిపూడి అభివృద్ధికోసం మన ఆనంద్ కూచిభొట్లను చైర్మన్‌గా చేశారని, విదేశాల్లోని ఎన్నారైలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇన్వెస్ట్‌మెంట్‌లను తెచ్చేందుకు రవి వేమూరును ఎపిఎన్‌ఆర్‌టీ సిఇఓగా నియమించారని, అందరికీ సర్వీస్ చేయడానికి నన్ను నియమించారని చెప్పారు. ఎన్నారైలు ఇచ్చే ప్రతి విరాళానికి నేను బాధ్యునిగా ఉండటంతోపాటు తన కార్యాలయం ఆయా పనుల ప్రగతి గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తుందని చెప్పారు. మీరిచ్చిన విరాళంతోపాటు, ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదలయ్యేలా చూసి పనులు చేపట్టడం పెద్ద బాధ్యతేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నీ రంగాల్లో పురోగమిస్తుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి గంటా సమాధానమిచ్చారు. చివరన టాకో సభ్యులు 50 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.