దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ...పెట్టుబడులకు మంచి ప్రదేశం
లండన్ చర్చాగోష్టిలో కేటీఆర్
పాలనాసంస్కరణలు, స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, తెలంగాణ ఇదే స్ఫూర్తితో పురోగమిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రస్తుతం అనేక రంగాల్లో దేశానికి రోల్ మాడల్‌గా రాష్ట్రం నిలిచిందని చెప్పారు. ప్రపంచంతో పోటీపడి ముందుకెళ్లాలంటే భారత్‌కు అద్భుతమైన, విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసరమని అత్యధికంగా ఉన్న యువతే భారత్‌ను అగ్రశ్రేణి దేశంగా మార్చగలదని చెప్పారు. లండన్‌లో భారత హైకమిషన్ నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో డిప్యూటీ హైకమిషనర్ సుజీత్ జోయ్ ఘోష్, నెహ్రూ సెంటర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిటన్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, భారత సంతతి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ సాధించిన విజయాలను దేశ విజయాలుగా చూడాలని, వాటిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
సంక్షుభిత పరిస్థితులను దాటుకొని ప్రపంచశ్రేణి కంపెనీలను ఆకర్షించే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారడానికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలనాసంస్కరణలే కారణమని కేటీఆర్ వివరించారు. పెట్టుబడులే కాకుండా ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతితక్కువ సమయంలో నిర్మించిన తీరును కేటీఆర్ వివరించగా, సమావేశానికి హాజరైనవారు చప్పట్లతో అభినందించారు.
విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాల పైన సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు కేటీఆర్ తన అభిప్రాయాలను సవివరంగా పంచుకున్నారు. వివిధ అంశాలపై మంత్రి మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రస్థానాన్ని వివరించిన విధానాన్ని వారు ప్రశంసించారు.