ఇవాంక రావడం వల్ల గొప్ప ప్రయోజనమే
అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకాట్రంప్ హైదరాబాద్‌కు రావడం వల్ల గొప్ప ప్రయోజనమే కలిగిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిప్రాయపడ్డారు. ఇవాంకతో పాటు ఆమె ప్రతినిధి బృందానికి తెలంగాణను, హైదరాబాద్‌ను పరిచయం చేయగలిగామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విదేశీ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. మొదట తెలంగాణను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అమెరికా అగ్రరాజ్యం.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తి. అంత ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తికి సలహాదారుగా ఉన్న ఇవాంక మన వద్దకు రావడం మనకు అందివచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు. తెలంగాణపై సదభిప్రాయం కలిగి మనదగ్గర పెట్టుబడులకు అమెరికా సంస్థలను ప్రోత్సహించే వీలుందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామన్నారు. అదే సమయంలో ఇతర ప్రభుత్వాల పాలసీలను గమనిస్తున్నామన్నారు. మా పారిశ్రామిక విధానం మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీకి సంబంధించిన పాలసీ దేశంలోనే వినూత్నంగా ఉంటుందన్నారు. సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్‌లో వెల్లడిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.