మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాల్గొనండి.. ఎన్నారైలను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. దీంతో పరాయి దేశంలో ఎంత సాధించినప్పటికీ, సొంతూరికి ఎంతోకొంత చేశామన్న సంతృప్తి దక్కుతుందని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రాధాన్యతను, ఏడేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. ఈ సభలో మహేశ్ బిగాలతో పాటు 22 మంది ఐటీరంగ ప్రముఖులు పాఠశాలల అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. వారిని మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను రూ.7,300 కోట్లతో మూడేండ్లలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాతలు విరాళాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. పాఠశాలల అభివృద్ధికి ఎన్నారైలు ముందుకు వస్తే స్థానికులు స్ఫూర్తిగా తీసుకొంటారని చెప్పారు. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నేడు దేశంలోనే తొలి విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని చెప్పడానికి ఇక్కడకు మరోసారి వచ్చానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరింపజేస్తున్నామని, ఎన్నారైలు వాటి దృష్టిసారించాలని కోరారు. త్వరలో హైదరాబాద్‌లోని మలక్‌పేట వైపు ఫోకస్ పెడతామని వెల్లడిరచారు. వ్యవసాయరంగం కాంట్రిబ్యూషన్ 16 శాతం నుంచి 21శాతానికి వృద్ధి చెందిందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్, కరోనా, కేంద్ర సహాయ నిరాకరణ వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ పురోగతిని సాధించిందని పేర్కొన్నారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తున్న 4వ రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.5 శాతమే అయినా ఆర్థిక వ్యవస్థలో కాంట్రిబ్యూషన్ 5 శాతం ఉన్నదని తెలిపారు. ఇవన్నీ వివిధ సంస్థల ద్వారా మోదీ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలేనని స్పష్టంచేశారు. హైదరాబాద్ మాదిరిగానే ఇతర రాష్ట్రాలకు రాజధాని నగరాలు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలు ఎందుకు పురోగతి సాధించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. కేసీఆర్ పెద్ద కలలు, గొప్ప ఆలోచనలతో ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తారని వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం 24 నుంచి 31.7 శాతానికి చేరిందని తెలిపారు. 240 కోట్ల మొక్కలు నాటడమే కాకుండా 1,600 నర్సరీలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో సమగ్ర అభివృద్ధి సాధించలేదని స్పష్టం చేశారు.
అలాగే రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను తయారుచేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. గణాంకాల ఆధారంగా సిరిసిల్లలో ఆంకాలజీ కేసులు, ములుగులో గుండె సంబంధ సమస్యలు, మహిళల్లో అనీమియా సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడిరచారు. ఆయా ప్రాంతాల్లో సంబంధిత వైద్యులను ఎక్కువగా నియమిస్తామని చెప్పారు. ఆరున్నరేండ్లలో రాష్ట్రంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలు నిర్మించినట్టు తెలిపారు. ప్రభుత్వ చర్యలు, కేసీఆర్ కిట్ల కారణంగా ప్రభుత్వ దవాఖానల్లో రద్దీ పెరిగిందని చెప్పారు. సాధారణ ప్రసవాలు పెరిగి, మాతా శిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా కొలంబియా యూనివర్సిటీలో డీన్‌గా పనిచేస్తున్న ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును వేదిక మీదకు పిలిచి మంత్రి కేటీఆర్ సన్మానించారు.
తెలంగాణలో ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌లో గ్రామస్థాయిలో కేవలం ట్యాంకులు కట్టి వదిలేశారని, అంతటా నీళ్లు ఇస్తున్నట్టు చెప్పుకొంటున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసినట్టు వివరించారు. ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పే ప్రధాని మోదీ కాళేశ్వరం ప్రాజక్టును గుర్తించలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో 12 వేల గ్రామాల్లో మంచినీరు, వైకుంఠధామం, నర్సరీ, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలున్నాయని తెలిపారు. సంసద్ ఆదర్శ్ యోజన కార్యక్రమంలో టాప్-10 గ్రామాల్లో ఏడు తెలంగాణకే వచ్చాయని, 12 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయని చెప్పారు.