అంగరంగ వైభవంగా మంత్రి లోకేష్ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖమంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుని మంగళగిరికి రాగా.. లోకేష్ వెంట భార్య బ్రహ్మిణి, తనయుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. మంగళగిరి పట్టణంలోని సీతారామకోవెలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి హుసేన్ కట్ట, గౌతమ్ బుద్ధ రోడ్, మిద్దె సెంటర్, ద్వారకా నగర్, లక్ష్మీ నరసింహ స్వామి గుడి మెయిన్ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. లోకేష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీతో మంగళగిరి పట్టణం పసుపుదనం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో మంగళగిరి జనసంద్రంగా మారింది.